భూతల స్వర్గంలో ప్రియాంక!
సిమ్లా : వారు పరస్పరం ఢిల్లీలో మూడు కిలో మీటర్ల దూరంలో నివసిస్తుంటారు. కాని ప్రియాంక గాంధి వాద్రా ధర్మమా అని వేసవి మాసాలలో కొద్ది కాలం పాటు సోనియా గాంధి, ప్రతిభా పాటిల్ సిమ్లాలో ఇరుగు పొరుగు కాగలరు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 12 కిలో మీటర్ల దూరంలోని చరాబ్రా గ్రామంలో అనేక ఎకరాల పండ్ల తోటల మధ్య కొండ పక్కగా ప్రస్తుతం నిర్మాణఁలో ఉన్న రెండతస్తుల భవనం పూర్తయినప్పుడు వారిద్దరూ పక్క పక్క భవంతులలో నివసించేవారు కావచ్చు.
ఆ నివాసాన్ని ప్రియాంక నిర్మిస్తున్నారు. ఆ భవనంలోని నాలుగు బెడ్ రూమ్ లలో ఒకదానిని సోనియా కోసం ప్రత్యేకిస్తున్నారు. స్వల్ప కాలం విశ్రాంతి కోసం తన కుమార్తెతో కలసి సిమ్లాకు వచ్చినప్పుడు సోనియాకు ఇది ఉపయోగిస్తుంది.
రాష్ట్రపతి సాంప్రదాయకంగా ప్రతి వేసవిలో రెండు మూడు వారాలు గడుపుతుండే గెస్ట్ హౌస్ 'ప్రెసిడెన్షియల్ రిట్రీట్'కు కేవలం 500 గజాల దూరంలో ఈ బంగళా ఉంటుంది. సాధారణంగా రాష్ట్రపతి విడిదికి సమీపంలో ఏ నిర్మాణాన్నీ అనుమతించరు. రాష్ట్రపతి కార్యాలయం, రాష్ట్రంలో ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భవన నిర్మాణానికి 2007లో ప్రియాంకకు అనుమతి ఇచ్చినప్పుడు లోలోపల నిరసన ధ్వనులు వినిపించాయి.
మూడు నాలుగు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఈ అత్యున్నత భద్రతా ప్రాంతం పరిధిలో ఉన్న కట్టడాలు ఈ రెండు భవనాలు మాత్రమే. వీటికి చుట్టూ పండ్ల తోటలు, అడవి పూల చెట్లు ఉన్నాయి. నేపథ్యంలో మంచుతో కప్పబడిన శిఖరాలు ఉన్న నీలి పర్వతాలతో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా కనిపిస్తుంటుంది. ఈ బంగళాకు శంకుస్థాపన 2008 సెప్టెంబర్ 6న జరిగింది. ఆ సందర్భంగా ప్రియాంక, ఆమె కుటుంబం ఒక యజ్ఞం చేశారు.
'ఇంటిని 3184 చదరపు మీటర్ల ప్లాట్ లో కొంత భాగంలో నిర్మిస్తున్నారు. ఇది ఈ సంవత్సరాంతానికి పూర్తి కావచ్చునని భావిస్తున్నాం' అని స్థానిక కాంగ్రెస్ కార్యకర్త కేహార్ సింగ్ ఖాచి చెప్పారు. ఢిల్లీకి చెందిన ఒక సంస్థ సాగిస్తున్న ఈ నిర్మాణాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. 'గ్రౌండ్ ఫ్లోర్ లో వంటగది, డైనింగ్ హాల్, గెస్ట్ రూమ్ ఉంటాయి. మొదటి అంతస్తులో నాలుగు బెడ్ రూమ్ లు, ఒక స్టడీ రూమ్ ఉంటాయి' అని మరొక ప్రతినిధి తెలియజేశారు.
'ఆధునిక శైలి, బ్రిటిష్ శైలి' సమ్మిళితంగా ఈ భవనం రూపురేఖలు ఉంటాయని వారు చెప్పారు. భవన నిర్మాణంలో ఉపయోగించిన ఇసుకను సోలన్ లోని పసుపురాయి గనుల నుంచి, పై కప్పు కోసం పలకరాయిని మండి జిల్లా కల్ఖర్ నుంచి రవాణా చేశారు. భద్రత మాత్రం కట్టుదిట్టంగా ఉంది. ఆ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. నిరుడు ప్రియాంకను ఫోటో తీసిన కొందరు ఫోటోగ్రాఫర్లను గార్డులు కొట్టి, వారి వద్ద నుంచి కెమెరాలను లాక్కున్నారు.
తాపీ పనివారు వాలుగా ఉండే పైకప్పునకు సంబంధించిన పని చేస్తుండడాన్ని దూరం నుంచి చూడవచ్చు. ప్రహరీ గోడ కాకుండా అసంపూర్తిగా ఉన్న పని అదే. అయితే, భవనంలో ఫర్నీషింగ్ పనికి ఇంకా ఆరు నెలలు పట్టవచ్చు. భవన నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రియాంక, సోనియా ఆదివారం చరాబ్రా చేరుకున్నారు. వారు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్ వైల్డ్ ఫ్లవర్ హాల్ లో బస చేసి మంగళవారం ఢిల్లీకి తిరిగి వెళ్ళారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తామని హామీ ఇచ్చింది. 'ప్రియాంక వంటి ప్రముఖురాలు ఒక రెసిడెంట్ కావడం రాష్ట్రానికే గౌరవప్రదం' అని ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ పేర్కొన్నారు.
News Posted: 17 June, 2009
|