చైనా టు చెన్నై...
చెన్నై : చెన్నైలో తయారైన నకిలీ ఔషధాలకు మేడిన్ ఇండియా పేరున నకిలీ లేబుల్స్ తగిలించి భారత్ లో వివిధ నగరాలకు సరఫరా చేస్తున్న ఒక కుంభకోణం చెన్నై రేవులో బట్టబయలైంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న చైనా నకిలీ ఔషధాల దిగుమతిని కేంద్రీయ ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (సిడిఎస్ సిఒ) అధికారులు కనుగొన్నారు. సెంట్రల్ డ్రగ్ అథారిటీ ఇప్పటి వరకు ఇలాంటి మూడు కన్ సైన్ మెంట్లను పట్టుకుంది. ఇవన్నీ యాంటీ బయాటిక్ మందులే. చైనాలో తయారైన ఇవి గత మే చివరి వారంలో మూడు దఫాలుగా భారత్ కు దిగుమతి అయ్యాయి. మేడిన్ ఇండియా లేబుల్స్ తో నకిలీ మందులు భారత్ కు స్మగుల్ చేస్తున్నట్లుగా చైనాకు చెందిన ఒక ఔషధ కంపెనీ సిడిఎస్ సిఒకు సమాచారం అందించడంతో ఈ గుట్టు బయటపడింది.
చెన్నై రేవు అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ (ఎడిసి) శాంతి గుణశేఖరన్ ఆధ్వర్యంలో సుమారు 76 లక్షల విలువైన మూడు కన్ సైన్ మెంట్లను పట్టుకొని సీల్ చేశారు. ఔషధ మిశ్రమాల తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగించే ఈ మందులను ముంబయికి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు, గుజరాత్ కు చెందిన ఒక ఔషధ కంపెనీ దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. అయితే దిగుమతిదార్లకు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నదా లేక చైనా సప్లయర్లు వీరికి తెలియకుండా వీరి పేర్లను ఉపయోగించుకుంటున్నారా అన్న విషయం తేలాల్సి ఉంది.
కాగా, ఈ దిగుమతుల్లో మొదటి కన్ సైన్ మెంట్ ఈ ఏడాది మే రెండోవారంలో చెన్నై రేవుకు చేరింది. ఇందులో రూ.21 లక్షల విలువైన 500 కిలోల రోక్సిత్రోమైసిన్ మందులు ఉన్నాయి. చైనాలోని సినోబ్రైట్ డెవలప్ మెంట్ లిమిటెడ్ అనే సంస్థ గుజరాత్ కు చెందిన ఎన్వీడ్రగ్స్ కంపెనీకి వీటిని సరఫరా చేసింది. రెండో కన్ సైన్ మెంట్ రూ.40 లక్షల విలువైన 400 కిలోల ప్రొజెస్టెరిన్ మందులతో మే చివరి వారంలో చెన్నై పోర్టుకు చేరింది. దీన్ని హాంకాంగ్ కు చెందిన తైన్ గావ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ డెవల్ మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ ముంబయికి చెందిన జె.కె.ఖో.ఖాని అండ్ కంపెనీ పేరున పంపించింది. ఈ రెండు కన్ సైన్ మెంట్లకు చైనాలోని రెండు లైసెన్స్ డ్ కంపెనీ లేబుల్స్ అతికించారు. ఇక మూడవ కన్ సైన్ మెంట్ లో రూ.15 లక్షల విలువైన రెండువేల కిలోల సిమెటిడిన్ ఔషధాలు మనదేశానికి చేరాయి. వీటిని ముంబయిలోని శీతల్ ఫార్మా చైనాకు చెందిన జెజియాంగ్ కెమికల్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్సపోర్ట్ కార్పొరేషన్ నుండి దిగుమతి చేసుకుంది. దీనిపై చైనా కు చెందిన ఓ లైసెన్స్ డ్ కంపెనీ తయారుచేసినట్లుగా లేబుల్స్ తగిలించారు. ఈ మూడు కేసుల్లోనూ చైనాలో తయారైన కల్తీ మందులు భారత్ కు దిగుమతి అయినట్లుగా వెల్లడైందని సిడిఎస్ సి ఒకు చెందిన సీనియర్ అధికారి తెలియజేశారు.
News Posted: 18 June, 2009
|