అడకత్తెరలో లెఫ్ట్
కోలకతా : లాల్ గఢ్ మారణకాండ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీని 'డోలాయమానం'లోకి నెట్టింది. పశ్చిమ మిడ్నపూర్ జిల్లా మొత్తాన్ని మావోయిస్టు గెరిల్లాలు క్రమంగా తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నందున సైనిక దళాలను రప్పించకుండా వారితో పోరు సాగించేందుకు ప్రభుత్వానికి మరొక లేదు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల అనంతరం సిపిఎంకు మిగిలిన కంచుకోటలలో ఈ జిల్లా ఒకటి. మరొక వైపు మావోయిస్ట్ గెరిల్లాలపై పూర్తి స్థాయిలో దాడులు ప్రారంభిస్తే వాటి వల్ల గణనీయ సంఖ్యలో స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. ఇప్పటికే అత్యంత వేగంగా కుంచించుకుపోతున్న లెఫ్ట్ వోటు బ్యాంకుకు దీని వల్ల మరింత గండి పడగలదు.
లాల్ గఢ్ మారణకాండపై ఏ చర్యలు తీసుకోవాలో పూర్తి బాధ్యతను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి పి. చిదంబరం బుధవారం నెట్టిన తరువాత అడకత్తెరలో పోకచెక్కలా ఉన్న ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి బుద్ధదేవ్ దౌత్య మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, చిదంబరంలను కలుసుకునేందుకు గురువారం ఆయన హుటాహుటిని న్యూఢిల్లీకి వెళ్ళారు.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, లాల్ గఢ్ ఒక్క బెంగాల్ రాష్ట్రం భద్రతకే కాకుండా మొత్తం దేశం భద్రతకే ప్రమాదకారకంగా పరిణమించిందనే విషయాన్ని గుర్తించవలసిందిగా డాక్టర్ మన్మోహన్ కు లేదా చిదంబరానికి నచ్చజెప్పేందుకు బుద్ధదేవ్ భట్టాచార్జీ ప్రయత్నించగలరు. 'ప్రధాని, హోమ్ మంత్రి కనుక ఆ విషయాన్ని గుర్తిస్తే, పెచ్చుమీరుతున్న మావోయిస్టుల దురాగతాలను అరికట్టడం ఏ ఒక్కరిదో బాధ్యత కాకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త బాధ్యత కాగలదు' అని కోలకతాలో సీనియర్ రాజకీయ విశ్లేషకుడు ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేదా చిదంబరానికి బుద్ధదేవ్ భట్టాచార్జీ నచ్చజెప్పలేకపోయిన పక్షంలో తనను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించగలరని లెఫ్ట్ ఫ్రంట్ వర్గాలు తెలియజేశాయి. 'తన రాష్ట్రానికి సంబంధించింది అభివృద్ధి కార్యక్రమమైనా లేక భద్రతా సమస్య అయినా ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ అనుబంధంతో నిమిత్తం లేకుండా రాష్ట్రం పట్ల సదా సానుభూతితో వ్యవహరిస్తుంటారు. బుద్ధదేవ్, ప్రణబ్ ముఖర్జీ మధ్య సత్సంబంధాలు ఉన్న దృష్ట్యా ఈ సారి సానుకూల ఫలితమే రాగలదని మేము విశ్వసిస్తున్నాం' అని లెఫ్ట్ ఫ్రంట్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. చివరకు ముఖర్జీకి నచ్చజెప్పడంలో కూడా బుద్ధదేవ్ విఫలమైన పక్షంలో మాజీ ముఖ్యమంత్రి ఒకరిని రంగంలోకి దింపి ముఖర్జీకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగలరు. జోక్యం చేసుకోవలసిందిగా జ్యోతి బసు కనుక ఫోన్ చేసి విజ్ఞప్తి చేస్తే ముఖర్జీకి ఆయన మాటను తోసిపుచ్చడం కష్టం కావచ్చు.
News Posted: 19 June, 2009
|