`ప్రసన్న' కాంగ్రెస్ కుట్రా?
హైదరాబాద్ : నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తిరుగుబాటు ధోరణి టిడిపి నాయకులను కలవరపెడుతోంది. ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వ్యవహారాలు మరిన్ని ముందుకు వచ్చే అవకాశం ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం తగిన జాగ్రత్తలు వహించాలని టిడిపి నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు కాంగ్రెస్ నాయకత్వం ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకునే అవకాశం ఉందని టిడిపి సీనియర్ నాయకులు చంద్రబాబు వద్ద తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2004 ఎన్నికల్లో టిడిపి ఓడిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై వెంటనే దాడిని మొదలు పెట్టారు. అతిగా వ్యవహరించామనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని, ఈసారి అలా కాకుండా అధికార పక్షానికి కొంత సమయం ఇచ్చి దాడిని మొదలు పెట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో అదే వ్యూహాన్ని అమలు చేశారు. అయితే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యవహారం తరువాత టిడిపి నాయకులు తిరిగి ఆలోచనల్లో పడ్డారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ మాట్లాడితే ఎలా ఉంటుందనే చర్చ టిడిపిలో సాగుతోంది. కచ్చితంగా అధికార పక్షం వైఖరి వల్లనే ప్రసన్నకుమార్ రెడ్డి తిరుగుబాటు ధోరణి అవలంభించారని టిడిపి నాయకులు చెబుతున్నారు.
టిడిపి ద్వారా రాజకీయ ప్రవేశం చేసి తరువాత కాంగ్రెస్ లో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటివారు ప్రసన్న వ్యవహారం వెనుక కీలక పాత్ర పోషించారని టిడిపి నాయకులు చెబుతున్నారు. దాదాపు ఏడాది పాటు అధికార పక్షానికి సమయం ఇవ్వాలని తొలుత భావించామని, కానీ ప్రసన్న వ్యవహారం తరువాత ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలనిపార్టీలో కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. ఊహించని విధంగా ప్రసన్నకుమరా రెడ్డి పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు ధోరణితో లేఖలు రాయడాన్ని పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరకు ప్రసన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు నియోజకవర్గం నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడడాన్ని పార్టీ నాయకత్వం తేలిగ్గా తీసుకోవడం లేదు.
అధికారంలోకి వస్తే పదవుల పంపకంలో అసంతృప్తి చెలరేగితే అర్థం చేసుకోవచ్చు అసలే ఎన్నికల్లో ఓడిపోయాం, చివరకు పార్టీ కార్యవర్గాన్ని సైతం రద్దు చేసినందున పార్టీ పదవులు పంపకాలు సైతం లేవు. అలాంటప్పుడు అసంతృప్తికి అవకాశమే లేదని కానీ ఊహించని విధంగా ఏకంగా ఎమ్మెల్యే అసమ్మతితో అధినాయకున్నే లక్ష్యంగా చేసుకుని లేఖలు రాయడం ఊహించని పరిణామమని టిడిపి నాయకులు చెబుతున్నారు. మరెవరూ ఇలా వ్యవహరించకుండా ఏం చేయాలనేదానిపై టిడిపిలో చర్చ సాగుతోంది.
News Posted: 22 June, 2009
|