పొంచి ఉన్న దుర్భిక్షం!
న్యూఢిల్లీ : లెక్కలు కట్టి మరీ చేసిన వాతావరణ సూచనలను తోసిరాజంటూ, రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ దేశంలో ఈ నెలలో వర్షపాతం మామూలు కన్నా 45 శాతం తక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు. నాలుగు నెలల వర్షాకాలంలో రెండవ నెల అయిన జూలైలో ఈ లోటును భర్తీ చేస్తూ వర్షం కురవని పక్షంలో దేశంలో ఈ సంవత్సరం దుర్భిక్షం వంటి పరిస్థితులు నెలకొనవచ్చునని వారు హెచ్చరించారు. దేశంలోని 35 వాతావరణ శాఖ సబ్ డివిజన్లలోకి 28 సబ్ డివిజన్లలో ఇంతవరకు లోటుతో (మామూలు కన్నా 20 శాతానికి మించి తక్కువగా) లేదా నామమాత్రంగా (మామూలు కన్నా 60 శాతానికి మించి లోటుతో) వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
రుతుపవనాలు నిర్ణీత వ్యవధి కన్నా ఒక వారం ముందుగానే మే 23న కేరళలో ప్రవేశించినప్పటికీ, జూన్ 1, జూన్ 17 మధ్య వర్షపాతం 39.5 మిల్లీ మీటర్ల మేరకు ఉంది. ఇది ఈ కాలంలో మామూలుగా నమోదయ్యే వర్షపాతం 72.5 మిల్లీ మీటర్ల కన్నా 45 శాతం తక్కువ. 'బంగాళాఖాతం నుంచి రుతుపవనాలలో మరింత కదలిక మా దృష్టికి రాలేదు. వాతావరణ పరిస్థితులు అననుకూలంగానే ఉన్నాయి' అని భారత వాతావరణ శాఖ (ఐఎండి) డైరెక్టర్ జనరల్ అజిత్ త్యాగి ఆదివారం 'ది టెలిగ్రాఫ్' విలేఖరితో చెప్పారు. 'బంగాళాఖాతంలో అల్ప పీడన మండలాల నుంచి ఉంటాయని ఊహించిన కదలికలు చోటు చేసుకోలేదు' అని ఆయన తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్ప పీడన మండలం వల్ల జూన్ రెండవ వారంలో లేదా మూడవ వారంలో తిరిగి వర్షాలు కురవగలవని ఐఎండి ఈ నెలలో కనీసం రెండు సార్లు సంఖ్యానుగత వాతావరణ సూచనలు చేసింది.
'ఇది ఆందోళన కలిగిస్తున్నది' అని చిత్తూరు జిల్లా గాదంకిలోని జాతీయ వాతావరణ రాడార్ కేంద్రం డైరెక్టర్, సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త మాధవన్ రాజీవన్ చెప్పారు. 'జూలైలో వర్షపాతం కీలకం కానున్నది. గతంలో కొన్ని సార్లు ఇదేవిధంగా వర్షాలు కురవడం ఆలస్యమైంది. కాని జూలైలో సమృద్దిగా వర్షాలు కురిస్తే ఆ జాప్య వల్ల లోటును సరిచేయవచ్చు' అని ఆయన అన్నారు. ఐఎండి ఈ సంవత్సరం ప్రథమార్ధంలో చేసిన దీర్ఘకాలిక వాతావరణ సూచనలో 2009లో 96 శాతం మేరకు లేదా దాదాపు మామూలు స్థాయిలో వర్షపాతం ఉండగలదని పేర్కొన్నది. ఆ వాతావరణ సూచన ఇప్పటికీ వర్తిస్తుంది. కాని దీర్ఘకాలిక వాతావరణ సూచనను 'అప్ డేట్' చేయగలనని, ఈ సంవత్సరం జూన్ లో దేశంలో నాలుగు ప్రాంతాలకు విడివిడిగా వాతావరణ సూచనలను చేయగలనని ఐఎండి ఈ సంవత్సరం ఏప్రిల్ లో వాగ్దానం చేసింది.
కాగా ఆందోళన చెందవలసిన అగత్యం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే మొత్తం వర్షపాతంలో 16 శాతం మాత్రమే జూన్ లో సాధారణంగా నమోదవుతుంటుందని వారు పేర్కొన్నారు. 'అయితే, జూలైలో తగినంతగా వర్షాలు పడని పక్షంలో, జూలై నెలాఖరుకు మనకు 20 నుంచి 25 శాతం వరకు లోటు ఉంటుంది. ఇండియాలో దుర్భిక్షం పొంచి ఉన్నదని సూచించవచ్చు' అని రాజీవన్ చెప్పారు. వాతావరణ సూచనలు చేస్తుండే ఐఎండిలో గతంలో ఆయన పని చేశారు. 'ఈ సీజన్ ద్వితీయార్ధం (ఆగస్టు, సెప్టెంబర్ నెలలు) ఆ లోటును భర్తీ చేయలేకపోవచ్చు' అని ఆయన సూచించారు.
బంగాళాఖాతంలో పశ్చిమ, వాయవ్య ప్రాంతాలలో వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు మరి మూడు రోజులలోగా ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలలోకి ప్రవేశించవచ్చునని ఐఎండి సూచించింది. కాని, బలమైన గాలులు లేకపోవడం వల్ల రుతుపవనాలు వచ్చే వారం దేశం మధ్య ప్రాంతంలోకి ప్రవేశించకపోవచ్చు. దేశంలోని వర్షాధార ప్రాంతాలలో పంటల పరిస్థితి ఇప్పుడు జూలైలోని వర్షపాతంపై ఆధారపడి ఉంటుందని వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇదే కాలంలో నారుపోసే వరిధాన్యానికి నీరు పుష్కలంగా కావలసి ఉంటుంది.
'విస్తార ప్రాంతాలలో నేల పొడిగా ఉంది. జూలైలో వర్షపాతం పరిమాణం, పంపిణీ సంతృప్తికరంగా ఉండవలసి ఉంటుంది' అని గుజరాత్ ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ వాతావరణ శాస్త్ర విభాగం అధిపతి వ్యాస్ పాండే పేర్కొన్నారు. 'ఈ ఆలస్యం దేశంలో వరి పండించే తూర్పు, ఉత్తర ప్రాంతాలలో ఆందోళన కలిగించవచ్చు' అని ఆయన అన్నారు.
News Posted: 22 June, 2009
|