2 నెలల పాపపై కట్నం కేసు!
ముంబై : జోయా ఇంకా డయాపర్స్ వాడుతోంది. తన తల్లి ఒడిలోనే పడుకుంటున్నది. నోటిలో పళ్ళు కూడా ఇంకా రాలేదు. కాని వరకట్నం వేధింపు కేసులో నిందితురాలైంది. అభం శుభం తెలియని రెండు నెలల పాపను ఆమె సవతి తల్లి పోలీసులకు అందజేసిన ఫిర్యాదు పత్రంలో ఏడుగురు పెద్దలతో పాటు నిందితురాలిగా పేర్కొన్నది. ఇదే విడ్డూరమైతే పోలీసులు మరింత అధ్వాన్నంగా వ్యవహరిస్తూ ఎఫ్ఐఆర్ లో ఆ శిశువు పేరును కూడా చేర్చారు.
ఉయ్యాలలో ఆడుకోవలసిన జోయా ఆహారం, నిద్ర కూడా లేకుండా తన తల్లితో పాటు అనేక గంటలపాటు పోలీస్ స్టేషన్ లోనే గడపవలసి వచ్చింది. ఆమెను పోలీసులు అరెస్టు చేయబోయారు కూడా.
ఆమె తల్లి రేష్మా షంసుద్దీన్ ఖాన్ పోలీసులను ఎంతగానో వేడుకున్నది. 'సాహెబ్ యె తో చోటీ బచ్చీ హై. ఇస్కా ఆప్నే కైసే కంప్లెయింట్ లే లియే. తో వోహ్ బోలే నై కుచ్ ప్రాబ్లెమ్ నహీఁ హై, హోతా హై సాత్-ఆఠ్ సాల్ కే బచ్చీ కే కోర్ట్ జాయేంగే (ఆమె పసిపాప అని, ఆమె పేరును మీరెలా ఎఫ్ఐఆర్ లో రాస్తారని నేను వారితో అన్నాను. ఇదేమీ పెద్ద సమస్య కాదని, తాము చిన్న పిల్లలపై కూడా వేరే కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. దీనితో కోర్టును ఆశ్రయించాలని మేము నిశ్చయించాం)' అని రేష్మా తెలియజేసింది.
మరి జోయా ముంబై సెషన్స్ కోర్టులో అతి పిన్న వయస్కురాలైన బెయిల్ దరఖాస్తుదారు కావడంలో ఆశ్చర్యం ఏముంది. ఆమెకు ఆదివారం ముందస్తు బెయిల్ మంజూరైంది. ఆమె ఇప్పుడు తన తల్లి సంరక్షణలో భద్రంగా ఉన్నది.
'నా క్లయంట్ నాకు ఫోన్ చేసి అంతా వివరించింది. పాప పేరు కూడా ఫిర్యాదుల ఉన్నట్లు చూశాను. దానితో వెంటనే సెషన్స్ కోర్టులో బెయిల్ దరఖాస్తు దాఖలు చేశాను' అని డిఫెన్స్ న్యాయవాది అశోక్ భోలె తెలియజేశారు.
ఇది ఇలా ఉండగా, దీనిపై ఏమి మాట్లాడాలో తెలియని స్థితిలో న్యాయ కోవిదులు ఉన్నారు. 'ఇది మరీ విడ్డూరం. ఎన్నడూ విని ఎరగనిది. కోర్టు ఏ పరిస్థితులలో ఈ ఉత్తర్వు జారీ చేసిందీ పరిశీలించవలసి ఉంది' అని న్యాయవాది ఉషా మాకసారె పేర్కొన్నారు.
అసలు ఫిర్యాదీ ఆ శిశువును ఈ ఊబిలోకి ఎందుకు లాగిందని, పోలీసులు కూడా శిశువును పోలీస్ స్టేషన్ కు పిలిపించడం సబబేనా అని ఈ కేసు గురించి విన్నవారు ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఈ విడ్డూరపు ఉదంతానికి బాధ్యత వహించవలసిన అధికారిని ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఎఫ్ఐఆర్ లో నుంచి శిశువు పేరును తొలగించారు.
News Posted: 22 June, 2009
|