రాజకీయ విద్యార్థిగా చిరు
హైదరాబాద్ : తన రాజకీయ జీవితం గురించి తాను సీరియస్ గానే ఉన్నానని నిరూపించుకునేందుకు, శాసనసభలో ఇతర ప్రతిపక్ష నాయకులకు ఎందులోనూ తీసిపోకుండా ఉండేందుకు ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి కొన్ని అంశాలపై ఎంపిక చేసుకున్న నిపుణుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆయన ఇప్పటికే మూడు సెషన్లు పూర్తి చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే లోగా మరిన్ని సెషన్లకు ఆయన హాజరు కావచ్చు. బడ్జెట్ సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కావచ్చు. పార్టీ కార్యక్రమాలలో తాను నిమగ్నమై లేనప్పుడు రెండు మూడు గంటల పాటు ఇంటి వద్దే పాఠాలు చెప్పడానికి వివిధ సబ్జెక్టులలో ఐదుగురు నిపుణులు, రిటైరైన ప్రొఫెసర్లను చిరంజీవి ఎంపిక చేసుకున్నారు.
చిరంజీవి సన్నిహిత సహచరుల సమాచారం ప్రకారం, రానున్న బడ్జెట్ సమావేశాన్ని ఆయన కీలకమైనదిగా భావిస్తున్నారు. రాజకీయాల గురించి తాను ఎంత సీరియస్ గా, నిబద్ధంగా ఉన్నదీ సూచించేందుకు ఇది ఒక పరీక్ష అని ఆయన భావిస్తున్నారు. రాజకీయాల నుంచి నిష్క్రమించడానికి, పార్టీని రద్దు చేయడానికి తాను సిద్ధమవుతున్నట్లుగా వస్తున్న వదంతులను తోసిపుచ్చడానికి ఇది ఒక మార్గం కాగలదని కూడా ఆయన భావన.
పూర్తి స్థాయి సమావేశాలలో సభలో తనదైన ముద్ర వేయడానికి చిరంజీవి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ఆయన సన్నిహిత సహచరుడు ఒకరు తెలిపారు. ధారాళంగా ఉపన్యాసం ఇవ్వడానికి మించి, రాజకీయాల పట్ల నిబద్ధతకు మించి ఆయన నిరూపించుకోవలసింది ఎంతో ఉంది. అసెంబ్లీలో ఆయన వ్యవహరించే తీరు పిఆర్పీపై ప్రజాభిప్రాయాన్ని మెరుగుపరచగలదని పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
అయితే, శాసనసభలో పరిస్థితులు చిరంజీవికి సవాల్ వంటివి కాగలవు. ఇతర ప్రతిపక్ష నాయకులతో పోలిస్తే ఆయన రాజకీయాలకు కొత్తవాడు. నారా చంద్రబాబు నాయుడు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జయప్రకాశ్ నారాయణ మాజీ ప్రభుత్వాధికారి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు ఇ. రాజేందర్ ఇప్పటికే ఒకసారి శాసనసభ్యుడుగా ఉన్నారు. చిరంజీవి తన వచోనైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడమే కాకుండా సభలో చర్చలలో పాల్గొనేందుకు విషయ పరిజ్ఞానాన్ని కూడా పెంచుకోవలసి ఉంటుంది.
News Posted: 23 June, 2009
|