వణికిస్తున్న వైఎస్
హైదరాబాద్ : తమ పార్టీల్లో అసమ్మతిని రేకెత్తించి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందంటూ ఆరోపిస్తున్న టిడిపి, టిఆర్ఎస్, పిఆర్పీలకు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాల వారీగా నిర్వహిస్తున్న పార్టీ సమావేశాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇతర పార్టీల నుంచి ఎవరైనా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరేందుకు వస్తామంటే కాదన వద్దని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ఆయా పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ సోమవారం శ్రీకాకుళం, మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. ఇతర పార్టీల నుంచి కొంతమంది ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరటానికి ఆసక్తి కనబరుస్తున్న అంశంపై చర్చ జరిగింది. పార్టీలో చేరేందుకు ఎవరైనా ముందుకు వస్తామంటే చేర్చుకోవాలని వైఎస్ ఈ సందర్భంగా చెప్పారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా రావడంతో టిడిపి, పిఆర్పి, టిఆర్ఎస్ లో ఆందోళన ప్రారంభమైంది. కాంగ్రెస్ తిరిగి అధికారం చేపట్టిన నెల రోజులలోనే టిడిపి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఇందుకు ప్రధాన కారణం టిడిపి నుంచి సస్పెన్షన్ కు గురై కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండాలనేది ప్రసన్న ఆలోచన అని ఆ పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. టిడిపిలో ఇంకా అసంతృప్తిగా ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారనీ, వారంతా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారేమోనన్న అనుమానాలు లేకపోలేదు. ఇదే పరిస్థితి పిఆర్పీకి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పిఆర్పీ చతికిలబడినందున, వచ్చే ఎన్నికలవరకూ ఆ పార్టీలో కొనసాగుతూ, డబ్బులు ఖర్చు చేసుకోవడం వృధా అనే భావన కొంతమంది నాయకుల్లో కనిపిస్తున్నది. ఇటువంటి భావంతో ఉన్న నాయకులంతా కాంగ్రెస్ కు వెళుతారేమోనన్న అనుమానం ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపరుస్తున్నది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు పై ఇప్పటికే చాలామంది నాయకులు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. తమ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడ్ కార్పెట్ వేసినట్లు వైఎస్ వ్యాఖ్యలు ఉన్నాయని టిఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా ప్రతిపక్షాల ఆందోళనలో అర్థం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఆయా పార్టీ సిద్ధాంతాలు నచ్చని వారు కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వస్తే చేర్చుకుంటామే తప్ప ఎవరినీ ప్రోత్సహించమని ఆయన తెలిపారు.
News Posted: 24 June, 2009
|