కొత్త రూట్లో కేసీఆర్
హైదరాబాద్ : ఎన్నికల అనంతరం పరిణామాలతో అతాకుతలం అయిపోయిన తెరాసాను గాడిలో పెట్టడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతర్గతంగా రేగిన చిచ్చును ఆర్పడానికి, విభేదించి బయటకు పోయి సొంతకుంపట్లు పెట్టుకున్నవారికి సమాధానం చెప్పడానికి ఆయన ద్విముఖ వ్యూహం రచించారని చెబుతున్నారు. అన్నింటికీ ప్రజల మధ్యనుండి ఉద్యమాలు నడపడమే సరైన మందని ఆయన కొత్త సిద్ధాంతాన్ని అనుసరించనున్నారు. అసమ్మతి నేతలకు సరైన సమాధానం ఆందోళనల రూపంలో ఇస్తేనే ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తామని నమ్మకానికి వచ్చిన కేసీఆర్ ఆ దిశలో పార్టీని సమాయత్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, సింగరేణిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే వీటివల్ల నిర్వాసితులైన వారికి పునరావాసం కల్పించే విషయంపై ఆందోళనలు నిర్వహించాలని తెరాస నిర్ణయించింది. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై కూడా ఆందోళనలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి నుంచి ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని తెరాస నిర్ణయించింది. తెరాస ఏర్పాటు చేయబోయే కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు సరైన రీతిలో ప్రాతినిథ్యం కల్పించాలని, ఈ మేరకు వివిధ జిల్లాల్లో చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారిని గుర్తించి వారికి మాత్రమే కమిటీల్లో స్థానం కల్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సెర్చ్ కమిటీ రెండు, మూడు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తుది నివేదిక కెసిఆర్ కు ఇవ్వనుంది. దానికనుగుణంగా కమిటీలను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో ఉద్యమ తీవ్రతను పెంచడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలంగా నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యావంతులు తదితర వర్గాలను కలుపుకువెళ్ళి ఉద్యమాన్ని బలోపేతం చేయాలనే దిశలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం వల్ల రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని, దీనిపై ఉద్యమించాలని పార్టీ ఆలోచిస్తోంది. సింగరేణిపై వచ్చే పది రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
News Posted: 25 June, 2009
|