కాంగ్రెస్ సంతృప్తికే బడ్జెట్
న్యూఢిల్లీ : కొత్తగా పన్నులు లేకుండా ఉన్నంతలో ఆర్థిక మాంద్యాన్ని అధిగమించేందుకు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రాజకీయంగా తన అధిదేవతను సంతోషపెట్టేందుకు ప్రయత్నించారు. యుపిఎ తొలి ఐదేళ్ళ కాలంలో బడ్జెట్లు ప్రవేశపెట్టిన చిదంబరం ప్రధాని మన్మోహన్ 'సమ్మతి'తోనే పనిచేశారు. రెండోసారి యుపిఎ హయాంలో కాంగ్రెస్ ప్రయోజనాలకే పెద్ద పీట వేసేందుకు ఆర్థిక మంత్రి ప్రయత్నించారు. ఇందిరాగాంధీ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ కు కాంగ్రెస్ అనుకూల పథకాలు ఏమిటన్నది స్పష్టంగా తెలుసు. 2014 లో జరిగే పార్లమెంటు ఎన్నికల కన్నా ముందుగా అనేక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోరాడాల్సి ఉంది. అందుకే గాంధీ కుటుంబానికి ప్రీతిపాత్రమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జవహర్ లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునరుద్ధరణ పథకాలకు నిధులను పెంచారు.
కాంగ్రెస్ లో సంస్కరణల అనుకూల వర్గానికి కూడా స్పష్టమైన సందేశం వెళ్ళింది. బడ్జెట్ సమర్పించిన కొద్ది సేపటి తరువాత ప్రధాని మన్మోహన్ సింగ్ దూరదర్శన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణబ్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన బడ్జెట్ గా పేర్కొన్నారు. గడచిన బడ్జెట్ లతో పోల్చి చూస్తే ఈ బడ్జెట్ లో ప్రభుత్వం - పార్టీల భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది.
బడ్జెట్ రూపకల్పనలో ప్రధానితో కాకుండా ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలతో మాత్రమే తరచూ చిదంబరం సంప్రతించేవారు. ఈ సంప్రతింపుల ప్రక్రియను ఈ ఏడాది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పదాధికారులకు ప్రణబ్ ముఖర్జీ విస్తరింపజేశారు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రతిపక్షాలను కూడా సంప్రతించారు. తొలిసారిగా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చలు జరిపిన ఆర్థిక మంత్రి ప్రణబ్ తన ప్రసంగంలో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తానన్నారు.
పార్టీలో సంస్కరణవాదులు ఈ బడ్జెట్ తో డీలా పడినప్పటికీ ఆర్థిక మాంద్యం ప్రభావం భారత్ పై పడకుండా ఉండాలంటే నష్ట నివారణ చర్యలు అనివార్యంగా చేపట్టాలి. 1982 - 84 వరకూ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ కు తన పార్టీ అధినేతలు కోరుకునేదేమిటో బాగా తెలుసు. కాంగ్రెస్ లో సీనియర్ అయిన ఆయనకు పార్టీ ఎన్నికల అవసరాలు, ప్రాథమ్యాలు బాగా తెలుసు కనుకనే ఆర్థిక మంత్రిగా ఎంపిక చేసుకున్నారు. కాంగ్రెస్ తీరుతెన్నుల గురించి ఇందిరాగాంధీ వద్ద మసలిన ఆయనకు మెరుగ్గా తెలుసు కనుకే... పార్టీకి ఆయన సేవలు అవసరం.
News Posted: 7 July, 2009
|