కపిల్ సిబల్ కు నిధులు నిల్
న్యూఢిల్లీ : విద్యారంగంలో సంస్కరణపై బడ్జెట్ లో ప్రస్తావన లేకపోవడం మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ ఆర్ డి) మంత్రి కపిల్ సిబల్ గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ విద్యా సంస్కరణ విషయంలో కొత్తగా ఎటువంటి పథకాన్నీ ప్రకటించలేదు. పైగా అమలవుతున్న పథకాలకు కూడా చాలీ చాలకుండా నిధులు కేటాయించడంతో హెచ్ ఆర్ డి అధికారులు ఆందోళన చెందుతున్నారు. వంద రోజుల అజెండాలో భాగంగా ఉన్నత విద్య, పరిశోధనల జాతీయ కమిషన్ నెలకొల్పుతామని కపిల్ సిబల్ హామీ ఇచ్చారు. దీన్ని వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని ప్రత్యేకంగా ఆయన చెప్పకపోయినా, కొన్ని సందర్భాల్లో సూచనప్రాయంగా తెలిపారు.
అదే విధంగా ప్రతిపాదించ దలచిన విద్యా హక్కు బిల్లు గురించి కూడా బడ్జెట్ లో లేకపోవడం హెచ్ ఆర్ డి వర్గాల్లో ఆందోళనను మరింత పెంచింది. 'హెచ్ ఆర్ డి మంత్రేమో ఎడా పెడా హామీలిచ్చారు. శాఖలో సంస్కరణలపై బడ్జెట్ మౌనం వంద రోజుల ప్రణాళికపై ప్రభావం చూపుతోంది' అని హెచ్ ఆర్ డి అధికారి ఒకరు పేర్కొన్నారు.
మొత్తం మీద యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)కి రెండు వేల కోట్ల రూపాయలలు కేటాయింపులు పెంచడం కొంత ఊరట ఇస్తోంది. తాత్కాలిక బడ్జెట్ తో పోలిస్తే ఉన్నత విద్యకు కేటాయింపులు రెండు వేల కోట్లు పెరిగాయి. నూతన ఐఐటీలకు 200 నుంచి 400 కోట్ల రూపాయలకు నిధులు హెచ్చాయి. అదే సమయంలో 2004 నుంచి యుపిఎ ఉమ్మడి అజెండాలో పేర్కొన్న విద్యా రుణాలపై వడ్డీలో సబ్సిడీ ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. 2006 నాటి బడ్జెట్ నుంచి వరుసగా ప్రస్తావిస్తున్న ఈ హామీ త్వరలో అమలవుతుందని హెచ్ ఆర్ డి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
News Posted: 7 July, 2009
|