పార్టీ విరాళాలకు పన్ను రద్దు
న్యూఢిల్లీ : పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య వర్గాలు, ఎన్నికల ట్రస్ట్ ల ద్వారా రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు నూరు శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారం తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు ఇప్పటికే పన్ను లేదు. అయితే, ఎన్నికల్లో నిధులు ఇచ్చినా, తమపై ఏ పార్టీ ముద్రా పడకూడదని భావించే కంపెనీలకు 'ట్రస్ట్' మార్గం ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
ఈ ప్రతిపాదనపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ విమల్ జలాన్ మాట్లాడుతూ, 'ఇది సానుకూల నిర్ణయం. రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహంలో పారదర్శకత వస్తుంది' అని వ్యాఖ్యానించారు. 'ఇది మంచి మార్పుని ఇస్తుంది. ఒక్కసారిగా అజ్ఞాతపు వ్యవహారాలు ర ద్దు చేయలేం. కానీ, లెక్కలు చూపే మొత్తాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలకు వ్యక్తులు, సంస్థలు ఇచ్చే విరాళాలకు పూర్తి పన్ను మినహాయింపు ఇస్తూ 2003లో ఎన్డీయే ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ, ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదనను స్వాగతించింది. వాస్తవానికి ఈ ప్రతిపాదన కోరుతూ ప్రధాని, ఆర్థిక మంత్రులకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, అరుణ్ జైట్లీ లేఖలు రాశారు.
మరో వైపున ఎన్నికల విరాళాలపై 'ట్రస్ట్' ప్రతిపాదనను వ్యతిరేకించిన వామపక్షాలు, ప్రభుత్వం తన ప్రతిపాదనను రద్దుచేసుకోవాలని కోరుతున్నాయి. ఈ నిర్ణయం రాజకీయ అవినీతిని పెంచుతుందని సిపిఎం అగ్ర నేత సీతారామ్ ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల భారతీయ కంపెనీలకు రాజకీయ వ్యవస్థ గులాంగిరీగా మారుతుందని సిపిఐ నేత గురుదాస్ దాస్ గుప్తా హెచ్చరించారు.
News Posted: 7 July, 2009
|