మూగనోమే ఔషధం
హైదరాబాద్ : అన్ని అసంతృప్తి రోగాలకు మౌనమే మందని తెరాస అధినేత కేసీఆర్ నిర్థారించారు. మాటల తూటాలతో, ఆరోపణల అస్త్రాలతో రెచ్చిపోతున్న తిరుగుబాటు దారులను అణచివేయాలంటే వారికి ఎదురు చెప్పకపోవడమే మంచిదని ఆయన భావిస్తున్నారు. మాట్లాడి మాట్లాడి వాళ్ళే అలసిపోతారని, ఎవరూ పట్టించుకోకపోతే నోరు మూసుకుని ఉంటారని ఆయన చెబుతున్నారు. మాటకు మాట సమాధానం చెబితే గొడవ పెరగడం మినహా ప్రయోజనం ఉండబోదని ప్రవచిస్తున్నారు. తిరుగుబాటు నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, ఎన్నం శ్రీనివాసరెడ్డి, ఎం.రహ్మాన్, కెకె మహేందర్ రెడ్డి, బీరవోలు సోమిరెడ్డి తదితరులు పార్టీ అధినేత కేసీఆర్ పై రోజుకోరకం ఆరోపణలు చేస్తూ చికాకు కలిగిస్తున్నప్పటికీ వాటికి జవాబులు ఇవ్వటం అనవసరం అని టిఆర్ఎస్ భావిస్తున్నది.
ప్రస్తుతం కేసీఆర్ బండారం బయటపెడతామని ఈ అసమ్మతి నేతలు హెచ్చరించారు. దానితో ఊరుకోకుండా కేసీఆర్ ను రాళ్ళతో కొట్టి తరమాలని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు లోక్ సభ నియోజకవర్గం అంతా తిరిగి ప్రచారం చేస్తామన్నారు. ఎవరో అనామకులు వ్యాఖ్యలు చేస్తే మీడియా కొండంతలు చేసి రాస్తున్నదని కరీంనగర్ లో కేసీఆర్ మండిపడిన తర్వాత మంగళవారం పత్రికల వారితో మాట్లాడిన ఎన్నం, జిట్టా తదితరులు మరోసారి తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. తాము అనామకులమైతే పార్టీ పదవులు ఎందుకిచ్చారని, ఎమ్మెల్సీలుగా ఎందుకు నిర్ణయించారని ప్రశ్నించటంతో టిఆర్ఎస్ ఆత్మరక్షణలో పడినట్టయింది.
అసమ్మతి నేతలు పార్టీలో ఉన్నంతకాలం అమిత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్, వారిని అనామకులు అని వ్యాఖ్యానించి ఉండాల్సింది కాదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అలా అనటం ద్వారా వారిని అనవసరంగా రెచ్చగొట్టినట్టయిందంటున్నారు. అసమ్మతి నేతలు ఎవరేమి మాట్లాడినా మౌనంగా ఉండాలని స్వయంగా ఆదేశించిన కేసీఆర్, మళ్ళీ తానే ఉద్రేకంతో అలా మాట్లాడుకుండా ఉండాల్సిందని సీనియర్ నేతలు కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. తమ అధినేతను కానీ, తమనుకానీ, పార్టీని కానీ అసమ్మతి నేతలు కించపరుస్తూ మాట్లాడినా, దూషణలతో కూడిన వ్యాఖ్యలు చేసినా తామేమీ స్పందిచబోమని ఒకరిద్దరు నేతలు అన్నారు. ప్రస్తుతం కేసీఆర్ కష్టకాలంలో ఉన్నారని, అంతా సర్దుకుంటుందని భావిస్తున్నామన్నారు.
News Posted: 9 July, 2009
|