తెరాస మూడంచెల వ్యూహం!
హైదరాబాద్: శాసనసభ, పార్లమెంటు ఎన్నికల అనంతరం ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిలో జరిగిన అసమ్మతి పరిణామాలతో కలవరపడిన అధినేత కె. చంద్రశేఖరరావు తిరిగి పార్టీని పట్టాలెక్కించేందుకు మూడంచెల వ్యూహాన్ని అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఆయన సమష్టి నాయకత్వంతో తిరిగి మూలాల్లోకి వెళ్లేందుకు సమాయత్తమౌతున్నారు. ఇందుకోసం వారం నుంచి కరీంనగర్లో మకాం వేసి తెరాస నేతలతో మంతనాలు కొనసాగించారు. 'ప్రచారం, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ'లతో ముందుకు సాగాలని నిర్ణయించారు.
ఐదేళ్లుగా ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టిన కేసీఆర్ ఈసారి ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని ప్రస్తావించాలని తలపోస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిల్లో నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ అనుకూల పార్టీలను ఆహ్వానిస్తున్నారు. ముందస్తుగా గోదావరి, కృష్ణానదులపై ఎగువ రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులపై ఆందోళన చేయాలని చూస్తున్నారు. అలాగే నదీజలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, భూములను ఇష్టారాజ్యంగా విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించనున్నారు. ఆయా అంశాలపై తెలంగాణవాసులను ఇంటింటి ప్రచారంతో చైతన్యపరచనున్నారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించి వ్యూహరచన చేయనున్నారు.
News Posted: 9 July, 2009
|