తీరవాసులకు స్మార్ట్ కార్డ్
న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్ 11న ముంబయి ఉగ్రవాద దాడుల దృష్ట్యా సముద్రతీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి స్మార్ట్ కార్డ్ ఆధారిత గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం చెప్పారు. దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసే చర్యలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తో సహా 9 కోస్తా రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 3,331 గ్రామాల్లో నివసించే ప్రజలకు 2010 మార్చి నాటికల్లా గుర్తింపు కార్డులను మంజూరు చేస్తామని చిదంబరం రాజ్యసభకు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, గోవా, ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు డామన్, డయ్యూ, లక్షదీవులు, అండమాన్ నికోబార్, పుదుచ్చేరిలలో ఈ గుర్తింపుకార్డులు జారీ చేస్తారు. ఈ పథకం రెండు దశల్లో అమలుచేస్తారని, తొలి దశలో 2009-10 సంవత్సరాల కాలంలో అమలుచేసే తొలి దశ కింద 3,331 గ్రామాల్లో గుర్తింపు కార్డులను జారీ చేస్తారని ఆయన చెప్పారు. తొలివిడతలో 12 లక్షల మందికి ఈ కార్డులు జారీ చేస్తారని కూడా ఆయన చెప్పారు. మిగిలిన కోస్తా ప్రాంతాల్లో రెండో దశ కింద గుర్తింపు కార్డులు జారీ చేస్తారని, 2011 జన గణనతో పాటుగా దీన్ని చేపడతారని చిదంబరం చెప్పారు. అలాగే ఈ గ్రామాల్లోని మత్స్యకారులకు రో గుర్తింపు కార్డును జారీ చేస్తారని, ఈ కార్డులను పశు సంవర్థక శాఖ, మత్స్యశాఖ జారీచేస్తాయని ఆయన చెప్పారు.
ప్రస్తుతం జాలర్ల మర పడవలను, బోట్లను మాత్రమే విడివిడిగా రిజిస్టర్ చేస్తున్నారు. సబ్సిడీపై డీజిల్ పొందడం, సహకార సొసైటీల్లో రుణసౌకర్యం పొందడం లాంటి రోజువారీ కార్యకలాపాలకు మత్స్యకారులకు ఈ గుర్తింపు కార్డులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చిదంబరం చెప్పారు. సముద్ర తీరప్రాంతాల గుండా టెర్రరిస్టులు దాడి చేసే ప్రమాదం ఉందని గూఢచార ఏజెన్సీల సమాచారం ఆధారంగా తమిళనాడును అప్రమత్తం చేయడం గురించి అడగ్గా తీర ప్రాంతాలను రక్షించడానికి ఆ రాష్ట్రం పటిష్ఠమైన చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.
News Posted: 9 July, 2009
|