రైల్వే పక్షపాతం తగదు
న్యూఢిల్లీ : ఉత్తరాది, దక్షిణాది మధ్య ప్రాంతీయ విబేధాలను రెచ్చగొట్టే తీరులో వ్యవహరిస్తున్న రైల్వే శాఖ వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని తెలుగుదేశం పక్షం నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే శాఖ మంత్రులుగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలు తమ రాష్ట్రాలకు మాత్రమే మేలు చేసుకున్నారని, మొత్తం రైల్వే శాఖను తమ రాష్ట్ర సొంత ఆస్తులుగా భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. ఆయన గురువారం రాజ్యసభలో రైల్వే బడ్జెట్ పై జరిగిన చర్చలో ప్రసంగించారు. రైల్వే శాఖలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని చెప్పారు. కాలం చెల్లిన రైలు పట్టాలను తుక్కుకింద విక్రయించే వ్యవహారంలోనే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. రైల్వే అవసరాలకు కావలసిన వివిధ వస్తువుల కొనుగోళ్ళలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి ఎట్టి చర్యలు తీసుకోవడం లేదని మైసూరా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ పట్ల రైల్వే మంత్రి మమతా బెనర్జీ వివక్ష చూపించారని ఆయన ఆరోపించారు. గతంలో లాలూ బండి బీహార్ కు, సహాయ మంత్రిగా పని చేసిన వేలు బండి చెన్నైకి వెళ్ళగా, ఈసారి మమత బండి బెంగాల్ వైపు దూసుకుపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంలో చేపట్టనున్న పథకాల వల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే 8751 కోట్ల రూపాయలను ఆర్జించి మూడు వేల కోట్ల మిగులు ఆదాయం చూసినప్పటికీ ఆదాయానికి వ్యయానికి ఎంత మాత్రం పొంతన లేని ఈస్ట్రన్ రైల్వేకి ఎక్కువ నిధులను కేటాయించడం పక్షపాతం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. దక్షిణ మధ్యరైల్వేకి గతంలో లభించిన 949 కోట్ల రూపాయల కేటాయింపులు 450 కోట్లకు తగ్గిపోయాయమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ నిర్మాణ పథకాలకు 5549 కోట్లు కావలసి ఉండగా కేటాయించిన నిధులు పెరిగిన నిర్మాణ వ్యయానికి సరిపోతాయని మైసూరారెడ్డి తెలిపారు. 33 మంది కాంగ్రెస్ ఎంపీలను పంపిన రాష్ట్రానికి యుపిఎ ప్రభుత్వం మొండి చెయ్యి చూపించిందని మైసూరా ఆరోపించారు.
News Posted: 10 July, 2009
|