నీడ లేని లాలూ!
న్యూఢిల్లీ : ఓడలు బండ్లు కావడమంటే ఇదే. నిన్నటి దాకా కేంద్రంలో చక్రం తిప్పిన బీహారీ నేత లాలూప్రసాద్ పార్టీ ఆర్జేడీకి ఇప్పుడు పార్లమెంటులో తల దాచుకోవడానికి నీడ కరవు కానుంది. లోక్ సభలో పార్టీల బలాబలాల ఆధారంగా కార్యాలయాలను కేటాయిస్తారు. మూడో అంతస్థులోని ఆర్జేడీ ఆధీనంలోని కార్యాలయాన్ని మాయావతికి కేటాయిస్తూ ఈ వారం మొదట్లో నోటీస్ ఇచ్చారు. బీఎస్పీ ఎంపీలు తమ కార్యాలయానికి వచ్చి మాయావతి చిత్రపటాన్ని ఎక్కడ తగిలించాలా అని చర్చలు చేస్తుంటే విస్మయం చెందటం ఆర్జేడీ నేతల వంతైంది. తొలుత ఆర్జేడీ కార్యాలయం పార్లమెంటులోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది. 2004లో లోక్ సభ సచివాలయాన్ని ఖాళీ చేసి, ఆర్జేడీకి ఇచ్చారు.
అధికార పక్షంలో లాలూ కూర్చుంటున్నప్పటికీ తదనుగుణంగా కార్యాలయం కేటాయింపునకు తగ్గ బలం ఆ పార్టీకి లేదు. పార్లమెంటు ఆవరణలో కార్యాలయం పొందాలంటే కనీసం 8 మంది ఎంపీలుండాలి. ప్రస్తుతం ఆర్జేడీకి నలుగురే ఉన్నారు. అయితే లోక్ సభ, రాజ్యసభల్లో కలిపి తమకు 8 మంది సభ్యులున్నందున కార్యాలయం తమకే ఉంటుందని ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. తమకు రక్షణగా కాంగ్రెస్ చక్రం అడ్డం వేయకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
మాయావతి నాయకత్వంలోని బీఎస్పీకి 21 మంది సభ్యుల బలం ఉంది. ఆ పార్టీ సభ్యులు మరోసారి ఆర్జేడీ కార్యాలయాన్ని సందర్శించలేదు. 20 మంది సభ్యుల బలం గల ప్రత్యర్థి పక్షం జనతాదళ్(యు)కి పెద్ద కార్యాలయం ఉండటం ఆర్జేడీకి మరింత కంటగింపుగా ఉంది. పార్లమెంటులోని అన్ని అంతస్థుల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నప్పటికీ మొదటి అంతస్థుకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అన్నట్టు ఇంతకు ముందు తెలుగుదేశానికి కేటాయించిన కార్యాలయం ప్రస్తుతం డీఎంకే స్వాధీనంలో ఉంది.
News Posted: 10 July, 2009
|