అధికారానికి 'అడ్డు గేటు'!
హైదరాబాద్ : ఈసారి ఎన్నికల్లో అధికారం ఖాయం అనుకున్న అధికారం టిడిపి కార్యాలయం ముంగిట వరకు వరకు వచ్చి నిలిచిపోయింది. అలా జరగడానికి కారణం ఏమిటి? ఓట్ల చీలిక, పిఆర్ పి, లోక్ సత్తా పార్టీలు ఇవిఎంలంటూ టిడిపి నాయకులు రకరకాల కారణాలను ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అసలు కారణం టిడిపి నాయకత్వానికి ఇప్పుడు తెలిసొచ్చింది. ఎన్టీఆర్ భవన్ కు ఉన్న గేటు టిడిపిని అధికారంలోకి రాకుండా బలంగా అడ్డుకుంది. ఔను... నిజం! ఎంతో ముచ్చటపడి చేయించుకున్న ఆ గేటు బాబును అధికారంలోకి రాకుండా అడ్డుకుంది. దాంతో ఆ గేటును ఊడబెరికి అక్కడ గోడ కడుతున్నారు. ఇక ఇప్పుడు టిడిపిని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ భవన్ కు ముందు వైపు రెండు గేట్లు ఉన్నాయి. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ వైపు ప్రధాన గేట్లు రెండు ఉన్నాయి. రెండింటిలో నైరుతి మూలన ఉన్న గేటు ఎప్పుడూ మూసివేసి ఉండేది. నైరుతి మూలన గేటు ఉండరాదని, ఆ గేటు వల్లే అధికారం చేతుల వరకు వచ్చి జారిపోయిందని వాస్తు నిపుణులు చెప్పడంతో హడావుడిగా శుక్రవారం ఆ గేటును తొలగించారు. అంతే వేగంగా అక్కడ గోడ కడుతున్నారు.
తనకు వాస్తుపైన, ముహూర్తాలపైన నమ్మకం లేదని చంద్రబాబు బహిరంగంగా చెబుతూ ఉంటారు. కానీ ఆయన నివాసంలో, పార్టీ కార్యాలయంలో వీటిని కచ్చితంగా పాటిస్తారు. 2004 ఎన్నికల సమయంలో వాస్తు నిపుణులు సలహా మేరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏకంగా సచివాలయం ప్రధాన ద్వారాన్నే మార్చేశారు. అప్పటి వరకు ఉపయోగించిన ద్వారాన్ని మూసివేయించి, లుంబినీ పార్క్ వైపు కొత్తగా గేట్లు ఏర్పాటు చేయించారు. అయినా 2004లో ముందస్తుగానే అధికారం చేజారిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ భవన్ లో, తన నివాసంలో వాస్తు మార్పులు చేయించారు. ఎన్టీఆర్ భవన్ లో చిన్నగేటు నుంచి లోనికి వెళ్ళే మార్గంలో కొన్ని చెట్లు ఉండేవి. తొలిసారి ఓడిపోయాక ఆ చెట్లను తొలగించి చిన్న దారిని పూర్తిగా పునర్నిర్మించారు. అదే విధంగా ఇంటిపైన చైనా వాస్తు గృహ నమూనాను నిర్మించారు. అయినా ఇవేవీ బాబును అధికారంలో నిలబెట్టలేకపోయాయి.
ఇప్పుడు రెండోసారి ఓడిపోయిన తరువాత ఇంటిపైన చైనా వాస్తును కొనసాగిస్తూనే స్థానిక నమ్మకాల ప్రకారం గుమ్మడికాయను రెండు వైపుల వేలాడదీయించారు. ఇక ఎన్టీఆర్ భవన్ లో నైరుతి మూలన ఉన్న గేటును తొలగించి గోడ కట్టిస్తున్నారు. ఎన్టీఆర్ భవన్ లో నైరుతి మూలన ఒంపుగా ఉండడం వల్ల అక్కడున్న టైల్స్ ను తొలగించి ఎత్తు పెంచడానికి మట్టి పోస్తున్నారు.
News Posted: 11 July, 2009
|