న్యూఢిల్లీ: గర్భిణులకు గర్భస్రావాన్ని అనుమతించే వ్యవధిని 20 నుంచి 24 వారాలకు పెంచాలన్న వైద్యఆరోగ్యశాఖ సిఫార్సును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముంబయిలో నికేత మెహతా కేసు నేపథ్యంలో గర్భస్రావ నిరోధక చట్టం (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ - 1971..ఎంటీపీ యాక్ట్)ను తిరిగి పరిశీలించేందుకు నియమితమైన కమిటీ కొన్ని సూచనలు చేసింది. పిండంలో జన్యు సంబంధ వ్యాధులను నూతన సాంకేతిక పరిజ్ఞానం కనుగొంటున్న కారణంగా మహిళల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని గర్భస్రావాన్ని 24 వారాల వరకు అనుమతించాలని ఈ కమిటీ సూచించింది.
భారత్ లో 20 వారాల తరువాత గర్భస్రావాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. గత ఏడాది సెప్టెంబర్ లో ముంబయికి చెందిన నికేత మెహతా అనే గర్భిణికి 24 వారాలు పూర్తి అయిన తరువాత పిండానికి హృద్రోగం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో గర్భస్రావానికి అనుమతి కోరగా బొంబాయి హైకోర్టు నిరాకరించింది. తరువాత కొద్ది కాలానికే మెహతాకు గర్భస్రావమైంది.