నింగి నుంచి గ్రహణ వీక్షణం
న్యూఢిల్లీ: గ్రహరాజు సూర్యునికి సంభవించే గ్రహణాన్ని కన్నులారా చూడాలని ఎవరికి మాత్రం అనిపించదు చెప్పండి. నేల మీద నుంచో, కొండ మీద నుంచో కాకుండా ఏకంగా నింగి నుంచి చూడటమంటే .. ఇంక ఆనందానికి అంతేముంటుంది. ఈ నెల 22న సంభవించే సూర్య గ్రహణాన్ని ఆకాశం నుంచి చూసేందుకు ప్రత్యేకంగా జెట్ లైట్ విమానం ఢిల్లీలో సిద్ధమైంది. గ్రహణం కనిపించే తీరు ఆధారంగా టిక్కెట్ వెల ఉంటుంది. సూర్యుని వైపు గ్రహణం కనిపించాలంటే రూ.80 వేలు, భూమి వైపు గ్రహణం కనిపించేట్టైతే రూ.30 వేలు చెల్లిస్తే చాలు. కళ్ల ముందు గ్రహణం సాక్షాత్కరిస్తుంది.
'గ్రహణ విమానం'లో టిక్కెట్ పొందిన ముంబయికి చెందిన 70 ఏళ్ల పారిశ్రామికవేత్త దీపక్ వి భీమని తన ప్రయాణానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు గ్రహణాన్ని నేల, నీరు, మంచుపై నుంచి వీక్షీంచానని, ఆకాశం నుంచి 41 వేల అడుగుల ఎత్తు నుంచి గ్రహణాన్ని చూడటం అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాని భీమని అంటున్నారు. 2003 నవంబర్లో అంటార్కిటికాలో గ్రహణ సందర్శనకు వెళ్లినపుడు బ్యాటరీ ఎక్కువసేపు పని చేయని కారణంగా ఐదారు ఫొటోలే తీయగలిగానని గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా ముంబయికి చెందిన ఒక సంస్ధలో నలుగురు డైరెక్టర్లు కూడా గ్రహణయాత్రకు సిద్ధమయ్యారు.
News Posted: 11 July, 2009
|