'పాన్' పరిధిలోకి పెన్షనర్లు!
న్యూఢిల్లీ: పింఛనుదారులతో సహా గృహిణులు, విద్యార్థులను కూడా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) పరిధిలోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రకారం వడ్డీ ఆదాయం పదివేలు దాటితే పాన్ వివరాలు నమోదు చేయాలి. లేనిపక్షంలో బ్యాంకులే టీడీఎస్(వనరుల్లో పన్ను మినహాయింపు)ను వచ్చే ఏడాది ఏప్రిల్ తరువాత అమలు చేస్తాయి.
ప్రస్తుతం తాము ఆదాయపన్ను పరిధిలో లేమని ధ్రువీకరణ పత్రాన్ని ఖాతాదారులు బ్యాంకు అధికారులకు సమర్పిస్తే సరిపోతుంది. డిపాజిట్లపై ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇకపై ఆ పప్పులు ఉడకవు. 2010 ఏప్రిల్ 1 నుంచి పాన్ నెంబర్ ను తప్పనిసరిగా ఖాతాదారులు సమర్పించాల్సిందే. 'తగినంత ఆదాయం లేని కారణంగా పింఛనుదార్లకు పాన్ అవసరం లేకపోయింది. ఈ నిబంధనలతో అనవసరమైన పేపర్ వర్క్ పెరుగతుంది.' ఛార్టర్డ్ అకౌంటెంట్ సుబ్రత అభిప్రాయపడ్డారు. నూతన నియమావళి ప్రకారం పాన్ నెంబరు సమర్పించాలి. లేదా వారి ఆదాయంలో 20శాతాన్ని పన్నుగా చెల్లించాలి. ప్రస్తుతం పాన్ కార్డు పొందటానికి వారం వ్యవధి మాత్రమే పడుతున్నట్టు అధికారులు తెలిపారు. పాన్ వివరాలు తప్పనిసరిగా తెలియచేయడం వల్ల పన్ను ఎగవేతకు దారులు మూసుకుపోతాయని వారు విశ్వసిస్తున్నారు.
News Posted: 13 July, 2009
|