పారా మిలటరీకి రోగాల దెబ్బ!
న్యూఢిల్లీ: భారత్ పారామిలటరీ దళాల్లో నాలుగో వంతు జబ్బున పడుతున్నాయి. మొత్తం ఐదు లక్షల మందిలో 1,22,700 మంది రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్, చర్మవ్యాధులతో సతమతమౌతున్నారు. ఆరోగ్య సమస్యలు పెరగటం దళాల స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని హోంశాఖ అధికారొకరు అన్నారు. సాధారణ నియామకాలున్న చోట కన్నా యుద్ధ వాతావరణంలో విధులు నిర్వర్తిస్తున్న వారిలోనే ఎయిడ్స్ అధికంగా ఉండటం అధికారులకు విస్మయంగా ఉంది.
ప్రస్తుతం ఎయిడ్స్ తో బాధ పడుతున్న వారు 1300 మంది ఉన్నారు. ఇప్పటికే 400 మంది మరణించారని, ఎయిడ్స్ వ్యాధి పెరుగుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎటూ పాలుపోవడం లేదు. 'తొడుగులు వాడాలని సూచిస్తే అధికారిక ఆదేశంగా మారే వీలుంది. అప్పుడు స్థావరాల వెలుపల లైంగిక భాగస్వాముల కోసం వెతికే మగవారిని అదుపు చేయడం కష్టంగా మారుతుంది' అని పారామిలటరీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో మావోయిస్టులు, ఉగ్రవాదులకు దాడులు చేయడానికి అవకాశం ఇచ్చినట్టు కాగలదని పేర్కొన్నారు. తొడుగులు వాడండని చెప్పని పక్షంలో హెచ్ ఐవీ కేసులు పెరుగుతున్నాయన్నారు.
అదే విధంగా చర్మవ్యాధులతో 52 వేలు, రక్తపోటుతో 27 వేలు, మధుమేహంతో 7 వేల మంది సిబ్బంది బాధ పడుతున్నారని అధికారులు వివరించారు. రక్తపోటు, మధుమేహం వల్ల 6,200 మంది హృద్రోగులయ్యారు. మానసిక సమస్యల కారణంగా 2006 నుంచి 2008 వరకు 86 భాతృహత్యలు, 70 ఆత్మహత్య కేసులు చోటుచేసుకున్నాయని తెలిపారు.
News Posted: 13 July, 2009
|