పార్టీ కన్నా మంత్రిత్వమే మిన్న
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ సభ్యులు పార్టీ సంబంధిత పనుల్ని పక్కన పెట్టి, తమ మంత్రిత్వ శాఖలపై శ్రద్ధ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వపు వందరోజుల విధాన లక్ష్యాలను పూర్తి చేయాలని తలపోస్తున్నారు. సోనియాగాంధీ త్వరలో తన బృందాన్ని విస్తరించినపుడు మంత్రులు ప్రణబ్, ఆంటోనీ, వీరప్పమొయిలీ, గులాం నబీ అజాద్ లను పార్టీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది. ఈ మార్పు లోక్ సభ ఎన్నికల అనంతరం జరగనున్న తొలి పార్టీ సమావేశంలోగానే ఉంటుంది. ఈ మేరకు ఒక రోజు పార్టీ సమావేశం ముంబయిలో జరిగే అవకాశం ఉంది. తద్వారా ఈ ఏడాది అక్టోబర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తేజాన్ని ఇవ్వొచ్చునన్నది వ్యూహం. క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన ఆగస్ట్ 9న లేదా రాజీవ్ గాంధీ జయంతి ఆగస్ట్ 20న ఈ సమావేశాలను నిర్వహించే వీలుంది.
'ఒకరికి ఒకే పదవి'ని పార్టీలో వర్తింపచేయాలని నిర్ణయించిన తరువాత ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ సమర్ధంగా అమలు చేయడాన్ని సోనియాగాంధీ గమనించారు. దీంతో కేంద్రమంత్రులు ఏకాగ్రతతో తమ శాఖలపై దృష్టి పెట్టాలని ఆమె ఆశిస్తున్నారు. సీనియర్ మంత్రుల్లో ఒకరైన అజాద్ తన శాఖ విధులతోపాటు స్వరాష్ట్రం కాశ్మీర్ వ్యవహారాలు, పార్టీ ప్రధాన కార్యదర్శి విధులకు సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. కేబినెట్లో నెంబర్ టూ అయిన ప్రణబ్ బెంగాల్ పీసీసీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఉండేలా చూసే ప్రణబ్ వంటి వ్యవహారదక్షుని కోసం పార్టీ అన్వేషిస్తోంది.
News Posted: 13 July, 2009
|