బాబు `ఓపెన్' ఆఫర్
హైదరాబాద్ : `పార్టీ నుంచి చెత్త మొత్తం పోయింది' ఇది ఎన్నికలకు ముందు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. `పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావచ్చు' ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న మాట. పార్టీని వీడి వెళ్ళిన వారందరికీ చంద్రబాబు తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్నికలకు ముందు పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు పార్టీకి రాజీనామా చేసి పిఆర్పీలో, ఇతర పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే. పార్టీని వీడివెళ్ళిన వారిపై చంద్రబాబు ఆ సయమంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వీడి వెళ్ళిన వారంతా చెత్త అని తిట్టిపోశారు. పార్టీని అడ్డం పెట్టుకుని అవినీతితో సంపాదించిన వారే ఇప్పుడు పార్టీని వీడి వెళ్ళారని, ఇలాంటి చెత్త వెళ్ళడం వల్ల పార్టీకి మేలే జరుగుతుందని, కొత్త వారికి అవకాశం కల్పిస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఈ `చెత్త' పైనే చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించారు.
గతంలో వీడివెళ్ళిన వారు తిరిగి పార్టీలోకి వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పిఆర్పీ విజయం సాధించకపోయినా 17 శాతం వరకు ఓట్లను సాధించడం వల్ల టిడిపి ఓటమికి కారణమైందని, దీనిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ ఎన్నికల నాటికే పిఆర్పీని బలహీనపరిచి, పార్టీలోని మాజీ టిడిపి వారిని తిరిగి టిడిపిలోకి ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆహ్వానిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నవారి జాబితాను రూపొందించుకుని ఆ నాయకులతో టిడిపి నాయకులు మంతనాలు జరుపుతున్నారు. జిల్లాల వారిగా టిడిపిలో బలమైన గ్రూపులు ఉన్నప్పటికీ పిఆర్పీ నుంచి మాజీ టిడిపి వాదులు రావడానికి పార్టీ నాయకులు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ముందు పార్టీ బలపడాలి, పిఆర్పీ అలానే ఉంటే టిడిపి బలపడడం కష్టం కాబట్టి ముందు పిఆర్పీలోని టిడిపి వారిని పార్టీలో చేర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు.
దేవేందర్ గౌడ్, కళావెంకట్రావు, తమ్మినేని సీతారాం, కోటగిరి విద్యాధర్ రావు వంటి నాయకులతో టిడిపి నాయకులు కొందరు మంతనాలుసాగిస్తున్నారు. వారెలాంటి నిర్ణంయ తీసుకుంటారో తెలియదు కానీ మేం మాత్రం వారితో టచ్ లో ఉన్నాం అని టిడిపి నాయకులు చెబుతున్నారు. కొందరు నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే వారిని పార్టీలో చేర్చుకోక తప్పదని చంద్రబాబు సీనియర్లకు వివరించారు. కాంగ్రెస్ టిడిపిలకు చెందిన నాయకలు పిఆర్పీలో చేరారని, ఏ పార్టీ నుంచి వచ్చిన నాయకులు తిరిగి ఆ పార్టీలో చేరితే పిఆర్పీ పని ఐపోయినట్టేనని, దీనివల్ల ఓట్ల చీలిక ప్రమాదం తప్పుతుందని టిడిపి నాయకులు చెబుతున్నారు.
News Posted: 14 July, 2009
|