సెటిలర్స్ కే కాంగ్రెస్ అందలం
హైదరాబాద్ : కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసే సాహసం చేస్తోంది. సమైక్యాంధ్ర నినాదానికి మరింత బలం చేకూర్చే విధంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని తెలంగాణాయేతర హైదరాబాదీకి ఇవ్వాలని యోచిస్తోంది. రాజధాని నగరంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న సెటిలర్స్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఈ ఫార్ములాను రూపొందించింది. సమైక్యాంధ్రను బలపరిచే బలమైన నాయకుడికి మేయర్ పదవిని ఇచ్చినట్లైతే పార్టీని నగరంలో మరింత పటిష్టంగా రూపొందించవచ్చని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అందరికీ ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. దాదాపు 36 మంది కాంగ్రెస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నందునే మేయర్ పదవి కాంగ్రెస్ కే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ - రంగారెడ్డి లోని సెటిలర్లను దృష్టిలో ఉంచుకుని వారి ఓటు బ్యాంకును శాశ్వతంగా పొందేందుకు వ్యూహరచన చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్ - రంగారెడ్డి ఓటర్లు పూర్తిగా సమైక్యాంధ్ర వైపే మొగ్గుచూపిన వైనం కాంగ్రెస్ కు ఉత్సాహం తెప్పిస్తోంది. శేరిలింగంపల్లి, ఎల్ బి నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, సనత్ నగర్, జూబ్లీహిల్స్ వంటి సెటిలర్లు ఉన్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కూకట్ పల్లిలో రెండోస్థానం సాధించింది. నిజానికి ఇవన్నీ టిడిపి కంచుకోటలే. అయితే, ఆ పార్టీ టిఆర్ఎస్ తో కలిసి పోటీ చేయడం, తెలంగాణకు అనుకూల తీర్మానం చేయడం వల్ల సెటిలర్లు టిడిపికి దూరమయి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు.
ఈ నేపథ్యంలో వారి ఓట్లను శాశ్వతం చేసుకునే వ్యూహంలో భాగంగా, రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణేత సెటిలర్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దానివల్ల శివారు ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలతో పాటు, పూర్వం ఉన్న 100 డివిజన్లలోని నియోజకవర్గాల సెటిలర్లను ఆకట్టుకోవాలంటే సెటిలర్ కే మేయర్ పదవి ఇవ్వడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా నగరంలో దశాబ్దాల నుంచి స్థిరపడి, ప్రజలందరికీ తెలిసిన నాయకుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రజాప్రతినిధిగా పదవులు నిర్వహించినవారయితే, మేయర్ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే వారిలో ఆంధ్రకు చెందిన నాయకుడిని ఎంపిక చేయాలా లేక రాయలసీమకు చెందిన సెటిలర్ ను ఎంపిక చేయాలో ఇంకా నిర్ణయించనట్లు తెలిసింది. ఆ రెండు ప్రాంతాలకు చెందిన సెటిలర్లలో ఎవరు స్థానిక ప్రజలకు బాగా తెలుసో, వారికే ఎక్కువ అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్న మాట వాస్వమేనని కాంగ్రెస్ ప్రముఖుడొకరు అంగీకరించారు.
News Posted: 14 July, 2009
|