కొల్లేటి కొంగల సందడి
ఏలూరు : కొల్లేటికి ముందుగానే విదేశీ కొంగల రాక మొదలైంది. కొల్లేరు సరస్సులో నీరు పూర్తిగా లేకపోయినప్పటికీ కొంగలు మాత్రం ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఖరీప్ కోతలు అనంతరమే ఈ సరస్సుకు ఈ కొంగలు వచ్చేవి. కాగా ఈ సారి వర్షాకాలం రాక ముందు నుంచే కొంగల రాక మొదలైంది. కృష్ణాపశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న కొల్లేరు సరస్సుకు శతాబ్దాలుగా విదేశీ పక్షులు వస్తున్నాయి. యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుండి కొంగలు, గూడ కొంగలు, నల్ల కొంగలు, నత్త కొట్టులు, నీటి కొంగలు, పంజాలు, చిలవులు, తోక పిట్టలు, గునుప కోళ్ళు, గువ్వలు, బురద కీచకాలు లాంటి పక్షులు ఇక్కడికి ప్రతిఏటా వస్తున్నాయి.
కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఇవి ఈ ప్రాంతంలో ఉండి గుడ్లను పొదిగి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ సరస్సుకు పక్షుల వలస గత మూడేళ్ళుగా బాగా పెరిగింది. గతంలో కొల్లేరు సరస్సు పూర్తిగా ఆక్రమణకు గురై కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. దీంతో వలస పక్షుల నివాసానికి అవకాశం లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో వలస పక్షులు కొల్లేటికి దూరమయ్యాయి. కాగా మూడేళ్ళ క్రితం ప్రభుత్వం చేపట్టిన కొల్లేరు ఆపరేషన్ తో పక్షుల విడిది మళ్ళీ మొదలైంది. ఇతర దేశాల నుండి వచ్చే పక్షులు ఈ ప్రాంతంలో గడ్డితో చెట్లపై నివాసం ఏర్పాటుచేసుకుని గుడ్లను పొదుగుతాయి. అనంతరం 15 రోజులకు ఈ గుడ్లను పిల్లలు చేసి వాటిని కూడా తమతో పాటుగా తమ ప్రాంతాలకు తీసుకెళతాయి. వలస పక్షులు కొల్లేటి ప్రాంతంలో సేద తీరుతున్నప్పుడు తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు.
కొల్లేటి సరస్సుకు వలస పక్షుల సంఖ్యను పెంచేందుకు పక్షుల అవాస కేంద్రాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా ఎడారిలా తయారైన ఈ ప్రాంతంలో పక్షులు వాలేందుకు వీలుగా మొక్కలను కూడా పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పక్షులపై వేటగాళ్ళు దాడి చేయకుండా ఫారెస్ట్ అధికారులు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కొల్లేరు సరస్సులో పూర్తిస్థాయిలో నీరు లేదు. అయినప్పటికీ కొంగలు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఈ కొంగలు తమ పంట పొలాలలను నాశనం చేస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది సీజన్ మొదలయ్యేసరికి గత ఏడాది కంటే అధిక సంఖ్యలో వలస పక్షులు వస్తాయని పర్యాటకులు ఆశిస్తున్నారు.
News Posted: 14 July, 2009
|