చైనా జనాభాను దాటేస్తాం!
న్యూఢిల్లీ: జనాభాపరంగా భారతదేశం 2030 నాటికి చైనా కన్నా ముందంజలో ఉంటుందని జాతీయ జనాభా అంచనాల కమిషన్ విశ్లేషిస్తోంది. 2026 నాటికి దేశ జనాభాలో 22శాతం ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే ఉంటారు. అద్ సమయంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లు కలిపి 22శాతం, నాలుగు దక్షిణాది రాష్ట్రాలు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 13శాతం మాత్రమే జనాభా ఉంటారు. భారత ప్రభుత్వపు లక్ష్యం 'ఇద్దరికి ఇద్దరు' అన్న నినాదాన్ని సాధించడానికి దేశంలోని మహారాష్ట్ర సహా 11 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంకా చాలాకాలం పడుతుంది. 2010నాటికి మొత్తం సాఫల్యతారేటు (టీఎఫ్ఆర్)ను రెండుకి తగ్గంచాలని 2000 సంవత్సరంలో నిర్ణయించారు. (టీఎఫ్ఆర్ అంటే స్త్రీ పిల్లల్ని కనగలిగే కాలంలో కనే పిల్లల సంఖ్య) ప్రభుత్వం నిర్దేశించిన కాలానికి ఇంకా ఒక ఏడాది వ్యవధి ఉండగానే ఈ లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, చండీఘర్, పుదుచ్చేరిలు సాధించాయి.
ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు టీఎఫ్ఆర్ రేటు సాధించాలంటే మరో 15, 20 ఏళ్లు పడుతుందని వైద్యఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి అమర్జిత్ సిన్హా తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం బీహార్, ఝార్ఖండ్, రాజస్థాన్లో 70శాతం మహిళలకు 18 ఏళ్లకే పెళ్లవుతుంది. కేరళ, హిమాచల్ ప్రదేశ్ లో 20 శాతం మహిళలకు త్వరగా వివాహాలు జరుగుతున్నాయి. కేరళలోని అలప్పుజ, పతనమిట్ట జిల్లాల్లో తక్కువ వయసులో పెళ్లిళ్లు సున్నాశాతంగా నమోదైంది. లేత వయసులోనే తల్లులౌతున్న యువతుల సంఖ్య బీహార్ ఎక్కువగా ఉంది. ఇందుకు భిన్నంగా తమిళనాడులోని తూతుక్కుడి, హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్, కాంగ్రాలో ఒక్క శాతం మాత్రమే లేత వయసు తల్లులున్నారు. అన్నట్టు దేశంలో సగానికిపైగా ..51శాతం జనభా పునరుత్పత్తి వయసులో ఉన్నారు.
News Posted: 14 July, 2009
|