కుళ్ళిపోని టమోటా!
న్యూఢిల్లీ: ఏటా వానాకాలం తరువాత రైతులు గిట్టుబాటు ధర రాక తమ తోటల్లోని టమోటా(రామ మునగ) పండ్లను మార్కెట్ కు కూడా తీసుకురాకుండా రహదారులపాలు చేయడం తరచూ జరుగుతోంది. మార్కెట్లో ధర లేకపోవడంతోపాటు టమోటా త్వరగా పండి నిల్వ చేయలేక పోవడం కూడా ఇందుకు మరో కారణం. మరో మూడేళ్లు ఆగితే రైతులకు ఈ ఇబ్బంది తప్పినట్టే. సాధారణ టమోటా రకం కన్నా 10 నుంచి 12 రోజులు నిల్వ ఉండే టమోటాని ఢిల్లీ శాస్త్రవేత్తలు సృష్టించారు.
ప్రపంచంలో కూరగాయల సాగులో చైనా తరువాత అగ్రస్థానంలో భారత్ ఉంది. దూర ప్రాంతాలకు రవాణా, నిల్వకు వీలు లేని కారణంగా ఉత్పత్తిలో 25-30శాతం కుళ్లిపోతోంది. జన్యుపరమైన మార్పుల ద్వారా టమోటా పండటం ఆలస్యమయ్యే రకాన్ని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనాసంస్థ(ఐఏఆర్ఐ) శాస్త్రవేత్తలు సాధించారు. సాధారణ రకం టమోటా వారం, పదిరోజులుంటుంది. ఈ నూతన రకం అదనంగా మరో 12 రోజులుంటుంది.
తద్వారా మార్కెట్లో మంచిధర వచ్చేదాకా రైతు ఆగే అవకాశం లభిస్తుంది. టమోటా పండేందుకు కారణమయ్యే ఎతీలిన్ ను ఉత్పత్తి చేసే ఎంజైమ్ ఏసీసీ సింథసేను శాస్త్రవేత్తలు వినియోగించారు. ఆలస్యంగా పండే ఈ రకాన్ని గతేడాది ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి రెండేళ్లపాటు పొలాల్లో కూడా ప్రయోగాత్మకంగా సాగు చేస్తారు. వీటిని వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి ఎంత లేదన్నా మరో మూడేళ్లు పడుతుందని ఢిల్లీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News Posted: 14 July, 2009
|