గంగానది అదృశ్యం?
ముంబయి : భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వికాశాన్ని, ఆర్థిక అభివృద్ధిని శతాబ్దాలపాటు ప్రభావితం చేసిన గంగానది అదృశ్యం కానున్నదా? అవుననే అంటున్నారు పరిశోధకులు. మరో యాభై ఏళ్ళలో గంగానది కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వందల నదుల స్థితిగతులను పరిశీలించిన నిపుణులు ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రపంచంలో అతి త్వరగా కుంచించుకుపోతున్న నలభై అయిదు నదుల్లో గంగానది కూడా ఒకటని తేల్చి చెప్పారు. గంగానది నుంచి సముద్రంలో కలిసే నీటిశాతం గత యాభై ఏళ్ళలో గణనీయంగా పడిపోయిందని వారు దృవీకరించారు. ఇలా ఎండిపోతున్న నదుల్లో ప్రపంచ పేరెన్నిక కన్న కొలంబియా, కాంగో, మిస్సిసిపి, నైగర్, పరాన, ఉరుగ్వే, ఎనిసే నదులు కూడా ఉన్నాయని వారు వివరించారు.
ఖండాలలోని మంచినీటి వనరుల స్థితిగతులపై అమెరికాలోని వాతావరణ పరిశోధన కేంద్రం నిర్వహించిన పరిశీలనల ప్రకారం ఇప్పటికే గంగానదిలో నీటి పరిమాణం తగ్గిపోతోంది. 2004లో గంగానదిలో ప్రవహించిన నీరు అంతకు ముందు యాభైఆరు సంవత్సరాల నీటిప్రమాణం కంటే 20 శాతం తక్కువగా ఉందని ఈ పరిశీలనలో వెల్లడైంది. రాబోయే దశాబ్దాలలో నీటి పరిమాణం ఇంకా గణనీయంగా పడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణాల చేత మరో యాభైఏళ్ళలో గంగానది పూర్తిగా అదృశ్యం అయిపోయినా ఆశ్చర్యం లేదని వారు చెబుతున్నారు.
గంగానదిలో వస్తున్న ఈ మార్పును దేశంలో తీవ్రమైన పర్యావరణ, ఆర్థిక అనర్ధాలకు దారితీయవచ్చునని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు తాగడానికి మంచినీటి కొరత తీవ్రంగా ఏర్పడుతుంది. కొన్ని కోట్ల ఎకరాల భూములకు సాగునీరు అందకుండా పోతుంది. అలానే గంగానదీ పరివాహక ప్రాంతంలో ఉన్న జనావాసాల నుంచి మురుగును సముద్రంలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉండదు. దీనివలన పర్యావరణ సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. గంగానదిలో నీరు తగ్గిపోవడం హిమాలయాలలో మంచు దిబ్బలు తగ్గిపోవడం ప్రధాన కారణం. మంచు కరిగి వచ్చేనీరే గంగానదికి ప్రధానమైన వనరు. అలానే గంగానది పరివాహక ప్రాంతంలో గత కొన్నేళ్ళుగా వర్షాలు తక్కువగా కురవడం మరో కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగానే హిమాలయాల్లో మంచు దిబ్బలు ఏర్పడడంలేదని, ఎల్ నినో ప్రభావంతో ఉత్తర భారతదేశంలో గత ఐదేళ్ళుగా వర్షాలు కురవడం తగ్గిపోయిందని చెబుతున్నారు. దీనికి అదనంగా గంగానది నీటిని వ్యవసాయం కోసం విచక్షణారహితంగా తోడేస్తున్నారని, నది చిక్కిశల్యమైపోవడానికి ఇది కూడా ఒక కారణమని వివరిస్తున్నారు. గంగానదిని రక్షించడానికి, కాలుష్యాన్ని అరికట్టడానికి గత పదిహేనేళ్ళుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా ఫలితం మాత్రం దక్కలేదు. పరిస్థితులు ఇలానే కొనసాగితే గంగానది భావితరాలకు పురాణాలలో కనిపించే దేవతగా మిగిలిపోవచ్చు.
News Posted: 14 July, 2009
|