పార్లమెంట్ భవనం శిధిలం?
న్యూఢిల్లీ : నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలకు మన దేశంలో ఏదీ అతీతం కాదు. నిలువెత్తు నిర్లక్ష్యానికి సాక్ష్యాత్తూ మన పార్లమెంట్ భవనమే ఇప్పుడు సాక్ష్యంగా నిలిచింది. నిర్వహణ లోపం కారణంగా ఎనభై ఒక్క సంవత్సరాల వయస్సు కలిగిన పార్లమెంటు భవన సముదాయం శిధిలమౌతోంది. కేంద్ర పెట్రోలియంగ్ శాఖ మంత్రి కార్యాలయంగా ఉపయోగిస్తున్న పార్లమెంట్ భవనం లోని 37వ నెంబరు గది పైకప్పు నుంచి కాంక్రీట్ పెళ్ళలు, ఇటుకలు రాలిపడ్డాయి. ఈ సంఘటన జరగగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కే రెహ్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. ఈ గదిపైన క్యాంటీన్ పాత్రలు కడిగే ప్రదేశం ఉండడం అక్కడ నీరు నిలువ ఉండిపోయినందునే పైకప్పు బలహీనపడిందని తేల్చారు. గదిపైకప్పు నుంచి కాంక్రీట్ పెళ్ళలు ఊడిపోవడంతో సీలింగ్ ఫ్యాన్ కూడా పడిపోయింది. కింద ఉన్న సామాగ్రి దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. జూను 30వ తారీఖు జరిగిన ఈ సంఘటన తరువాత భవనం భద్రత గురించి అధికారులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. క్యాంటీన్ ఉండడం మంచిదికాదని గ్యాస్ సిలిండర్ల్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు నిర్ణయించారు. దాంతో అక్కడి నుంచి క్యాంటీన్ ను తరలించడానికి ప్రతిపాదించారు.
ఈ సంఘటన అనంతరం భవనాన్నిపరిశీలించిన రెహ్మాన్ ఖాన్ మాట్లాడుతూ `పైన పెద్ద నూనె మడుగు ఉంది. అసహ్యకరమైన వాసన వేస్తోంది. చరిత్రాత్మకమైన పార్లమెంట్ భవన నిర్వాహణలో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది' అన్నారు. పార్లమెంట్ భవన సముదాయాన్ని సర్ ఎడ్విన్ ల్యూటియన్స్, సర్ హెర్బట్ బేకర్ లు రూపకల్పన చేశారు. 1920లో నిర్మాణం ప్రారంభించారు. 1927లో దీనికి ప్రారంభోత్సవం చేశారు. నాలుగు అంతస్తులుగా గుండ్రంగా నిర్మించిన ఈ భవనంలో ఎగువ సభ, దిగువ సభలకు ప్రత్యేక సమావేశ మందిరాలు, ఉభయసభల సమావేశాలకు ఒక మందిరం, మంత్రుల కార్యాలయాలు, అధికారుల కార్యాలయాలు ఉంటాయి.
News Posted: 14 July, 2009
|