నక్సల్స్ గెరిల్లా వార్
హైదరాబాద్ : మెరుపు దాడులు కొనసాగించడం, ఉద్యమాల్లో ప్రజలను భాగస్వాములను చేయడం, భద్రతా దళాల అణచివేత చర్యలను సమర్ధంగా ఎదుర్కోవడం ద్వారా పార్టీని పునర్ నిర్మించుకోవాలని మావోయిస్టు పార్టీ నిర్ణయించింది. గెరిల్లా దాడులను ఉధృతం చేయడం ద్వారా దేశంలోని మిగతా ప్రాంతాలకు కూడా ప్రభావాన్ని విస్తరించాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ పొలిట్ బ్యూరో గత నెలలో పార్టీ కేడర్ కు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ కు సంబంధించి ఒక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు పేర్కొన్నారు. ఈ వ్యూహంలో భాగంగానే రెండు రోజుల కిందట చత్తీస్ గఢ్ లో వరుస మెరుపు దాడులు జరపడం ద్వారా ఒకే రోజు 39 మంది పోలీసులను మట్టుపెట్టినట్లు తేటతెల్లమవుతోంది. చత్తీస్ గఢ్ లో పోలీసులపై జరుపుతున్న దాడుల్లో ఎస్పీ స్థాయి అధికారిని హతం చేయడం మావోయిస్టు చరిత్రలో ఇదే తొలిసారి.
`శత్రువు'పై దాడులు చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఆ సర్క్యులర్ లో మావోయిస్టు పార్టీ తన క్యాడర్ కు సూచించింది. కాంగ్రెస్, బిజెపిలను `కరోడ్ పతు'ల పార్టీలుగా మావోయిస్టు పార్టీ అభివర్ణించింది. తగినంత సిబ్బంది, మద్దతు లేని కారణంగా ప్రభుత్వం ఎదురుదాడి చేయలేక పోతోందని, నక్సల్స్ ను అణచి వేసేందుకు `కోబ్రా' వంటి మరికొన్ని ప్రత్యేక బలగాలను రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని హెచ్చరించింది. అయితే దీన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలని సూచించింది. దాడులను ఉధృతం చేయడం ద్వారా ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందుల్ని కలిగించాలని పార్టీ పొలిట్ బ్యూరో పేర్కొంది. `శత్రువు ఇబ్బందుల్లో ఉన్నాడని మనం ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల ఆస్తులకు నష్టం కలిగించకూడదు. మన పోరాటంలో ఒక వేళ ఎప్పుడైనా తప్పులు జరిగితే తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలి' అని స్పష్టం చేసింది.
శ్రీలంకలో ఎల్టీటిఇ శత్రువును సరిగా అంచనా వేయలేకపోవడం వల్లనే దెబ్బతిందని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. అయితే అటువంటి తప్పులు మనం చేయకూడదని హెచ్చరించింది. `మారుతున్న శత్రువు వ్యూహాలను, సామర్ధ్యాన్ని అంతర్జాతీయంగా లభిస్తున్న మద్దతును అంచనా వేయడంలో ఎల్టీటిఇ తప్పుచేసింది. శత్రువును తక్కువ అంచనా వేయడంతో పాటు సొంత బలగాలపై ఎక్కువగా ఊహించుకుంది' అని ఎల్టీటిఇ పరిస్తితిపై మావోయిస్టు పార్టీ విశ్లేషించింది. భారతదేశంలో మొత్తం ఆరువందల జిల్లాలు ఉండగా వీటిలో నూటయాభై జిల్లాల్లో నక్సలైట్లకు మంచి పట్టు ఉందని, ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ పాలన నామమాత్రంగా ఉండగా, మరి కొన్ని చోట్ల ప్రభుత్వ పాలన అసలంటూ లేకుండా పోయిందని తన సర్క్యులర్ లో విశ్లేషించినట్లు తెలిసింది. దీనికి ఇటీవల కాలంలో ఒరిస్సా, చత్తీస్ గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో 200 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది హతమార్చడమే దీనికి నిదర్శనమని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు.
News Posted: 15 July, 2009
|