జడ్జిలకు ఇళ్ల కొరత
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 26 నుంచి 31కి పెంచాలని పార్లమెంటు ఆమోదించిన తరువాత కూడా నియామక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. నూతనంగా నియమితులయ్యే ఐదుగురు జడ్జిలకు కేటాయించే అధికారిక నివాసాల గురించి కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు మధ్య లేఖల యుద్ధమే ఇందుకు కారణం. ఈ అంశంపై ఎంతో కాలం ఎదురు చూడలేమని ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ స్పష్టం చేస్తూ నెల క్రితం పంపిన లేఖపై సమాధానం కోసం సుప్రీంకోర్టు వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఇళ్లైతే అందుబాటులో ఉన్నాయి. కానీ, కోరుకున్న అధికారిక నివాసాలను కేటాయించడం సాధ్యం కాని పరిస్థితి ఉందని పట్టణాభివృద్ధిశాఖ వర్గాలు వెల్లడించాయి. న్యాయమూర్తులు ప్రాధాన్యత ఇస్తున్న కృష్ణమీనన్ మార్గ్, తుగ్లక్ రోడ్, అక్బర్ రోడ్, మోతీలాల్ నెహ్రూ మార్గ్ లో టైప్ 8 నివాసాలు ఖాళీగా లేకపోవడమే అసలు సమస్య.
జడ్జిలకు సమీప ప్రాంతాల్లో టైప్ 8కి సమానమైన నివాసాలను కేటాయించగలమని, టైప్ 8 ఖాళీ అయినపుడు వాటిని కేటాయించగలమంటూ, కొత్త బంగళాలను సృష్టించలేమని పట్టణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వాదనతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందడం లేదు. ప్రధాన న్యాయమూర్తి బాలకృష్ణన్ తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు. ఈ నెల 6న ఆయన మాట్లాడుతూ, తామెంతో కాలం ఆగలేమని, త్వరగా ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు.
News Posted: 16 July, 2009
|