గ్రహణ వీక్షణ క్షేత్రం తెరగణ
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాకు 25 కిలోమీటర్ల దూరంలోని తెరెగణ పట్టణం ఖగోళ పరిశోధకులు, యాత్రికులకు ఆటపట్టు కానుంది. ఈ నెల 22న సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణం ఈ శతాబ్దంలోనే సుదీర్ఘంగా 6.39 నిమిషాలపాటు ఉంటుంది. ఇంతటి సుదీర్ఘ గ్రహణం 123 ఏళ్ల తరువాత .. 2132 జులై 13 వరకు సంభవించదు. ఇంతకీ తెరగణ .. ప్రత్యేకత ఏమిటంటే 20 ఏళ్లపాటు పరిశోధన చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ నెల 22న ఏర్పడే సూర్య గ్రహణాన్ని వీక్షించడానికి భూమిపైన అనువైన ప్రదేశంగా ప్రకటించింది. అన్నట్టు ఆరో శతాబ్దంలో జీవించిన భారతీయ ఖగోళశాస్త్రవేత్త ఆర్యభట్ట ఎప్పుడో ఈ పట్టణాన్ని ప్రస్తావించారు. ఇక్కడ సూర్య దేవాలయంలో ఆర్యభట్ట తన పరిశోధన కొనసాగించాడు. ఈ దేవాలయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు.
22నాటి గ్రహణం వల్ల 200 కిలోమీటర్ల పరిధిలో గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్లో గ్రహణ నీడ పడుతుందని ప్రొఫెసర్ విక్రాంత్ నారంగ్ తెలిపారు. ఈ ఛాయ జపాన్, చైనాలకు కూడా విస్తరిస్తుందని చెప్పారు. తెరగణకు పరుగులు తీస్తున్న యాత్రికులు, శాస్త్రవేత్తలకు అక్కడ హోటళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి అక్కడకు చేరుతున్న అతిథులకు తగ్గ సౌకర్యాలు లేవు. తాత్కాలికంగా వసతి కల్పించేందుకు బీహార్ పర్యాటక శాఖ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. నాసా, ఇస్రో తదితర సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు 17వ తేదీ నుంచి తెరగణ పట్టణంలో మకాం వేయనున్నారు. ఇక్కడ ఉన్న ఒక ఆస్పత్రి పై భాగాన్ని తాత్కాలిక పరిశోధనా క్షేత్రంగా మలచుకొంటున్నారు.
News Posted: 16 July, 2009
|