యూసఫ్ కు వధువు ఎక్కడ?
వడోదర : ఏదో సామెత చెప్పినట్టు ఇర్ఫాన్ ప్రేమ యూసఫ్ పెళ్ళికొచ్చినట్టయింది. చిన్న కొడుకు ఇర్ఫాన్ పఠాన్ ఆస్ట్రేలియాలో ఉంటున్న తన చిరకాల ప్రేమికురాలితో పెళ్ళి నిశ్చయం చేసేసుకున్నాకా, ఇంటికి పెద్ద కొడుకుకు వధువును వెదకడంలో బిజీగా ఉన్నారు వారి తల్లితండ్రులు. పెద్ద కొడుకు యూసఫ్ పఠాన్ కు పెళ్ళి అయితేనే గాని ఇర్ఫాన్ కు లైన్ క్లియర్ కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సంబంధాలు వస్తున్నాయని, కాని ఇంటికి రాబోయే పెద్ద కోడలను ఎంపిక చేసేందుకు సమయం పడుతుందని వారి తండ్రి మెహబూబ్ ఖాన్ చెప్పారు.
అన్ని విధాల యూసఫ్ కు సరిజోడీగా ఉండాలని, అతనిని బాగా అర్ధం చేసుకుని, సర్దుకుపోగల అమ్మాయి కోసం అన్వేషిస్తున్నామని ఆయన వివరించారు. అమ్మాయి నచ్చి పెళ్ళి ముహూర్తం కుదరాలంటే అల్లా దయ మేరకే జరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ క్రికెట్ ప్రాక్టీస్ లో తలమునకలై ఉన్నారని చెప్పారు. ఇర్ఫాన్, యూసఫ్ లు చాలా కష్టపడుతున్నారని, ఛాంపియన్ ట్రోఫీకు ముందు శ్రీలంకతో జరిగే మ్యాచ్ ల్లో ఇర్ఫాన్ కు చోటు దక్కవచ్చని మెహబూబ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన ఐపిఎల్ టోర్నీలో యూసఫ్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన 26 సంవత్సరాల యూసఫ్ సౌతాఫ్రికాలోవచ్చే సెప్టెంబర్ లోజరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన 30 మంది ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకున్నాడు.
News Posted: 16 July, 2009
|