జోగయ్య జేబులు చిరిగాయా?
హైదరాబాద్ : ఓట్లయితే రాలలేదు గానీ, నోట్ల కట్లకు మాత్రం కాళ్ళొచ్చాయి. చిరును నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన వేలాది మంది కుర్రాళ్ళు ఇప్పుడు అప్పుల పాలైపోయి ఊళ్ళలో తప్పించుకు తిరుగుతున్నారు. అనుభవం లేక అత్యుత్సాహంతో కొత్త వాళ్ళు కన్నూమిన్నూ కానకుండా ఖర్చుపెట్టేశారని అనుకున్నా, కొంతమంది సీనియర్లూ జేబులు చించుకున్నారట. ఆపై చేతులు కాల్చుకున్నారట... మరికొంతమంది కొంపలకే నిప్పెట్టేసుకున్నారట... అలాంటి వారిలో చేగొండి హరిరామజోగయ్య కాస్త నయమేనని చెబుతున్నారు. పాలకొల్లులో చిరంజీవి విజయాన్ని తన భుజాలపై వేసుకున్న ఈ సీనియర్ వృద్ధ నాయకుడు అందినకాడికి అప్పులు చేసి ప్రచారం సాగించారట. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత అధినేత నుంచి ఆ డబ్బులు వచ్చే దారిలేక ఇక్కట్లు పడుతున్నారట.
చిరంజీవిపై అభిమానంతో కాంగ్రెస్ ఎంపి పదవికి సైతం రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరిన సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఆర్థికంగా నష్టపోయినట్లు పార్టీ వర్గాల సమాచారం. చిరంజీవి పాలకొల్లులో పోటీచేసినా, అక్కడ చేసిన ప్రచారం, కేటాయించిన సమయం తక్కువే. చిరు ప్రచార బాధ్యతలన్నీ జోగయ్యే భుజాన వేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ డబ్బును మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చుచేస్తున్న నేపథ్యంలో, జోగయ్య కూడా అప్పులు చేసి మరీ కాంగ్రెస్ కు పోటీగా ఖర్చు చేశారు. చిరంజీవి ఆ డబ్బు ఇస్తారన్న భరోసాతో ఆయన విజయం కోసం అందినకాడికి అప్పు చేసినట్లు పార్టీ వర్గాల కథనం. అయితే, చివరి సమయం వరకూ చిరు నుంచి ఎలాంటి `స్పందన' రాకపోవడంతో ప్రచారం చివరలో జోగయ్య స్తబ్దుగా ఉండిపోయారు.
ఎన్నికలు ముగిసి ఇంతకాలం అవుతున్నా, తాను ఎవరి కోసమయితే ఖర్చు చేశారో, ఆయన నుంచి `రావలసిన' డబ్బులు రాకపోవడంతో జోగయ్య ఇబ్బందిపడుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పులు ఇచ్చినవాళ్ళు రోజూ ఆయన ఇంటి చుట్టూ తిరిగిపోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీనిపై జోగయ్య వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది.
News Posted: 17 July, 2009
|