గాలి కారు ఆవిష్కరణ
వరంగల్ : ఆటోమెబైల్ దిగ్గజం రతన్ టాటా `నానో' అంటే మన తెలుగు విద్యార్ధులు కూడా మరి `మేము సైతం' అంటూ గాలి కారును పరుగులెత్తించారు. రాబోయే తరాల ఆలోచనలు వాహనాల తలరాతలను మార్చేస్తాయని నిరూపించారు. ప్రకృతిలో కొరత అనేది లేకుండా దొరికే గాలి నే ఇంధనంగా మార్చివేశారు. మనిషి కలలను కళ్ళెదుట ఆవిష్కరించారు. కేవలం గాలి వత్తిడితో నడిచే కారును రూపొందించిన ఈ యువ ఇంజనీర్లు క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు. జనగామ సమీపంలో ఉన్న ఈ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఎన్ జాయ్ కుమార్, వై వసంతకుమార్, ఎం కౌశిక్, పి దీపక్ కుమార్, ఆర్ పూర్ణ చందర్, జి రాజేశ్ లు తొమ్మిది నెలల పాటు కష్టపడి ఈ కారును రూపొందించారు. వీరికి వరంగల్ నిట్ ప్రొఫెసర్ పులి రవికుమార్ వీరికి గైడ్ గా వ్యవహరించారు.
ఫియట్ కారును, మారుతీ కారును తీసుకుని వాటి ఇంజన్లను టూ స్ట్రోక్ ఇంజన్లుగా మార్పుచేశారు. గాలితో పిస్టను తిరిగేలా ఇంజన్ ను రూపోందించారు. కంప్రెస్ చేసిన గాలితో నింపిన ట్యాంకును దీనికి ఇంథనంగా అనుసంధానం చేశారు.అధిక పీడనంతో గాలి ఇంజన్ లోకి ప్రవేశించే విధంగా పైప్ ను వినియోగించారు. నిర్ణీత పీడనంతో గాలి ఇంజన్లోకి ప్రవేశించగానే పిస్టన్ తిరుగుతుంది. కారు పరిగెడుతుంది. గాలి పీడన శక్తి మీద వాహనం వేగం ఆధారపడి ఉంటుంది. ఈ కారుని గురువారం ప్రయోగాత్మకంగా నడిపారు. జెఎన్ టియూ రిజిస్ట్రార్ సాయిబాబా రెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డయాసిస్ ఎడ్యుకేషనల్ సొసైటీ డిప్యూటీ మేనేజర్ డాక్టర్ రాజా, కళాశాల డైరెక్టర్ కె. విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News Posted: 17 July, 2009
|