మైకేల్ జాక్సన్ `రికార్డు'
లాస్ ఏంజెలెస్ : భూగోళాన్ని ఉర్రూతలూగిస్తున్న గళం ఏదీ? ఏ గంధర్వుని గాన మహిమ విశ్వ మానవ వీనులకు విందులను చేస్తోన్నది? ఇంకెవరిది... మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఆకస్మిక మరణం మళ్ళీ అతనిని స్వర సామ్రాజ్యానికి చక్రవర్తిగా నిలిపింది. అతని అల్బమ్ లు ప్రపంచ వ్యాప్తంగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అమెరికా పాప్ చార్టుల్లో మైకేల్ ఆల్బమ్ ల అమ్మకాలదే అగ్రస్థానం. వరసగా మూడు వారాలు అతని అల్బమ్ లు అత్యధికంగా అమ్ముడుపోయి రికార్డులు బద్దలు గొట్టాయి. జూన్ 25న మైకేల్ మరణించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఈ అమర గాయకుని అల్బమ్ లు తొమ్మిది మిలియన్లకు పైగా అమ్ముడుపోయాయి. గడచిన వారం రోజుల్లో ఒక్క అమెరికాలోనే 11 లక్షల కాపీలు అమ్ముడయ్యాయని, మూడు వారాల్లో కంబైన్ అమ్మకాలు 23 లక్షల కాపీలు దాటి పోయిందని నెల్సన్ సౌండ్ స్కాన్ వెల్లడించింది.
కాగా పాప్ రారాజు మరణం తరువాత అతని పాటల అల్బమ్ లకు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయిందని, వీటి అమ్మకాల సంఖ్య 90 లక్షలకు మించిపోయిందని లాస్ ఏంజెలెస్ టైమ్స్ పేర్కొంది. మైకేల్ రికార్డంగ్ అమ్మకాలపై హక్కులున్న సోనీ మ్యూజిక్ మాత్రం ఈ అమ్మకాల సంఖ్యను వెల్లడించడం లేదు. అయితే సోనీ అధికార ప్రతినిధులు మాత్రం కేటలాగ్ సంఖ్యలను తిరస్కరించడం లేదు. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో మైకేల్ అల్బమ్ ల అమ్మకాలు పాప్ చార్ట్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.
News Posted: 17 July, 2009
|