భాగస్వామికై మేటాస్ నిరీక్షణ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి నిన్నటి వరకు ప్రీతిపాత్రమైన మేటాస్ సంస్థ ప్రస్తుతం వ్యూహాత్మక భాగస్వామి కోసం ఎదురు చూస్తోంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చాక అందరూ అనుమానించినట్టుగానే మేటాస్ దక్కించుకున్న మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసింది. సత్యం రామలింగరాజు పెద్ద కుమారుడు తేజరాజు మేటాస్ ఇన్ ఫ్రా సంస్థ వైస్ ఛైర్మన్, సీఈవో కూడా. 2007-08 ఆర్థిక సంవత్సరంలో రూ.97 కోట్లు లాభాలార్జించిన మేటాస్ గత ఆరు నెలలుగా నెలకు రూ.60 కోట్లు నష్టాలతో నడుస్తోందని అభిజ్ఞవర్గాల భోగట్టా. మొత్తం రూ.350 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్న ఈ సంస్థ 2008-09 సంవత్సరానికి ఇంకా ఫలితాలను ప్రకటించలేదు. సత్యం ఉదంతం తరువాత బోర్డులో నలుగురు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించినా ఫలితం లేకపోయింది.
గతవారం రూ. 12,500 కోట్ల విలువైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నిధుల కొరతతో చేతిలో ఉన్న ప్రాజెక్టులను కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో కూడా ప్రాజెక్టులున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వాటా విక్రయధర ఎక్కువ ఉన్న కారణంగా ఆఫర్లు రావడం లేదు.
News Posted: 18 July, 2009
|