ప్రజారాజ్యంలో ఉత్సాహం
హైదరాబాద్ : `సూర్యుడు' గుర్తు లభించడంతో ప్రజారాజ్యం పార్టీ నాయకత్వంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. పార్టీ కోర్ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపి అనేక నిర్ణయాలుతీసుకుంది. పార్టీ పునర్నిర్మాణానికి అవసరమైన కమిటీలను నియమించి కార్యకర్తలను, నాయకులను కార్యోన్ముఖులు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్, సి.రామచంద్రయ్య, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఉమా మల్లేశ్వరరావులు సమావేశమై అనేక కీలక నిర్ణయాలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పునర్నిర్మించేందుకు వీలుగా అన్ని స్థాయిల్లో కమిటీలు వేసే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
రాష్ట్ర స్థాయిలో ప్రస్తుతం ఉన్న పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ స్థానంలో 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని నియమించాలని నిర్ణయించారు. అలాగే ప్రధాన కార్యదర్శులను కూడా నియమించి ప్రతీ మూడు జిల్లాలకు ఒకరిని ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించనున్నారు. అలాగే జిల్లా, మండల స్థాయిల్లో కూడా కమిటీలు, పార్టీ అనుబంధ ప్రజాసంఘాలు, విభాగాలు (సెల్స్) కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈనెల 22 తర్వాత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఆ తర్వాత జిల్లా, మండల కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీల్లో ఎనిమిది వేల నుంచి పదివేల మంది వరకు నాయకులు, కార్యకర్తలను వివిధ హోదాల్లో నియమించి పార్టీకి పూర్తిస్థాయి సైనికుల్లా పనిచేయించాలని ప్రజారాజ్యం భావిస్తోంది. కమిటీల నియామకాన్ని త్వరలో పూర్తిచేసి రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి, పార్టీ ఆవిర్భావదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లో రెండురోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని ఈ కమిటీ నిర్ణయించింది.
పార్టీ పునర్నిర్మాణానికి అవసరమైన కార్యకర్తలకు రాజకీయ అవగాహన, వివిధ అంశాలపై పరిజ్ఞానం కలిగించేందుకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. పార్టీకి శాశ్వత భవనం నిర్మించాలనీ, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే అన్ని హంగులతో పక్కా భవనం నిర్మించాలని భావిస్తున్నారు. ఇందులో అధునాతన హంగులతో పాటు ఒక భారీ సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
News Posted: 18 July, 2009
|