బేగంపేట'కు షూటింగ్ కళ
హైదరాబాద్: హైదరాబాద్ లో విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించడంతో కళ తప్పిన బేగంపేటకు సినిమా తారల రాకతో వెలుగొచ్చింది. ప్రస్తుతం తెలుగు నిర్మాతలే కాకుండా హిందీ నిర్మాతలు కూడా తమ చిత్రాలను ఇక్కడ చిత్రీకరించేందుకు పరుగులు తీస్తున్నారు. గత నెలలో ఒక హిందీ చిత్రం చిత్రీకరణ జరిగింది. ఈ నెలాఖరులోగా యశ్ రాజ్ ఫిలింస్ వారి చిత్రం చిత్రీకరణ జరగనుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రముఖ తెలుగు నటీనటులు నాగార్జున, ఇలియానాలతోపాటు తిరుపతి బ్రదర్స్ చిత్రం కూడా ఇక్కడే షూటింగ్ జరిగాయి. గతంలో 2002 వరకు బేగంపేట రన్ వేపై షూటింగ్ కు అనువతించిన అధికారులు తరువాత ట్రాఫిక్ పెరగడంతో అనుమతులు ఇవ్వలేదు. రన్ వే పై చిత్రీకరణకు విమానయానశాఖ డైరెక్టర్ జనరల్ అనుమతి పొందాలి. అదే విమానాశ్రయ ఆవరణలో అనుమతికి విమానాశ్రయ డైరెక్టర్ అనుమతి చాలు.
తమ విమానాశ్రయానికి తారాతోరణం తరలిరావడం పట్ల విమానాశ్రయ అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయ ఆవరణలో షూటింగ్ నిర్వహణకు గంటకు రూ.28వేలు నిర్మాతలు చెల్లించాలి. గతంలో రాత్రి వేళల్లోనే షూటింగ్ లకు అనుమతించే వారు. ఇప్పుడా ఇబ్బంది లేకపోయినప్పటికీ ప్రయాణికులు ఉన్నట్టుగా ప్రేక్షకులకు భ్రమ కల్పించడానికి 100 మంది జూనియర్ ఆర్టిస్ట్ ల అవసరం మాత్రం ఏర్పడింది.
News Posted: 18 July, 2009
|