రాష్ట్రంలో మరో 3 'వర్శిటీలా?
హైదరాబాద్: ఇటీవలి సంవత్సరాల్లో రాష్ట్రంలో నెలకొల్పిన విశ్వవిద్యాలయాలు ఇంకా ఒక గాడిన పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మరో మూడు విశ్వవిద్యాలయాల కోసం అర్రులు చాస్తోంది. 2009 బడ్జెట్లో నూతన విద్యాసంస్థలు నెలకొల్పేందుకు కేంద్రం నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రతిపాదిస్తున్న విశ్వవిద్యాలయాలను 2011-12లో ప్రారంభించేలాగా ఉన్నత విద్యా సంస్థ ప్రణాళిక రచిస్తోంది. 2008లో ఆరు విశ్వవిద్యాలయాలు.. శ్రీకాకుళం- అంబేద్కర్ 'వర్శిటీ, కరీంనగర్- శాతవాహన, కర్నూలు- రాయలసీమ, మహబూబ్ నగర్-పాలమూరు, నెల్లూరు-విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ఇవన్నీ ప్రస్తుతం పీజీ కళాశాలల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. వీటికి అనుబంధ కళాశాలలు లేకుండానే ఒక్కో విశ్వవిద్యాలయంలో 300 మందికి పైగా విద్యార్థులున్నారు. అనుబంధ కళాశాలల ప్రక్రియ ప్రారంభించేందుకు తగినంత మంది సిబ్బంది లేరని ఒక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆవేదన చెందారు.
మరోవైపు 2006లో ప్రారంభించిన మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం(నల్గొండ), ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం(రాజమండ్రి)లకు సరిపడా నిధుల్లేవు. పెద్ద విశ్వవిద్యాలయాలకు రూ.9కోట్లు కేటాయించిన ప్రభుత్వం కొత్త విశ్వవిద్యాలయాలకు రూ.20 లక్షలు కేటాయించడమే గగనంగా ఉంది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 415 మంది విద్యార్థులున్నారు. అయితే, నూతన భవనాల నిర్మాణానికి ఇంతవరకు భూమే కేటాయించలేదు. కాగా, నూతనంగా మూడు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడం కష్టసాధ్యమేనని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు. విశ్వవిద్యాలయాలు లేనిచోటనే వీటిని నెలకొల్పే అవకాశం ఉంది.
News Posted: 18 July, 2009
|