మంత్రి 'ముతక' పురాణం!
హైదరాబాద్: బహిరంగ విపణిలో బీపీటీ రకం బియ్యం ధరలను నియంత్రించడంలో విఫలమైన ఫౌరసరఫరాలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు ఒక (అ)నుచిత సలహా ఇచ్చారు. ప్రజలు సన్నరకం బియ్యం తినడం మాని.. లావుపాటి(దొడ్డు) బియ్యం తినాలని ఆయన తేల్చారు. రాష్ట్రంలో సన్నరకం ఉత్పత్తి తగ్గిందనీ, దీనికి తోడుగా ప్రజల వినియోగం పెరిగిందని చెప్పారు. ఈ కారణంగానే సన్నాలు సరసమైన ధరలకు దొరకడం లేదని మంత్రివర్యులు విశ్లేషించారు!
శుక్రవారం మంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన ధరల నియంత్రణ మండలి భేటీ వివరాలను జూపల్లి విలేఖరులకు వివరించారు. సన్నాల్లో కన్నా లావు బియ్యంలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. పనిలో పనిగా కందిపప్పు ధరలు కూడా ఉత్పత్తి తక్కువగా ఉన్న కారణంగానే ధరలు పెరుగుతున్నాయని సూత్రీకరించారు. కొందామన్నా కూడా ఎక్కడా దొరకడం లేదని తెలిపారు. నిజమే! మంత్రి లావు బియ్యం తినమన్నారే కానీ.. జొన్నలు, రాగులు, వరిగలు, సజ్జలు తినాలని మంత్రి సలహా ఇవ్వలేదు.. మరి! ఇంతకీ దొడ్డు బియ్యం వినియోగానికి మంత్రులే శ్రీకారం చుట్టి.. ప్రజలకు మార్గదర్శనం చేయాలి. యథా మంత్రీ .. తథా ప్రజా కదా!
కందులు ప్రజల అవసరాలకు సరిపడా పండలేదని చెబుతున్న అమాత్యులు.. ప్రజల వినియోగానికి మించి పండిన బియ్యం ధరలు ఎందుకు దిగిరావడం లేదో చెబితే బాగుండేది. 20 రూపాయలకే బియ్యం విక్రయించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలు అందుబాటులో ఉందీ లేనిదీ పరిశీలిస్తే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు. అన్నట్టు.. మినప పప్పు, శనగ పప్పు ధరలకు కూడా కళ్లెం వేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. వారి ఆశలు అడియాశలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
News Posted: 18 July, 2009
|