`కారు' కదలడం లేదు
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపిలు సన్నద్ధం అవుతుండగా తెలంగాణ రాష్ట్ర సమితిలో నైరాశ్యం, ప్రజారాజ్యం పార్టీలో దిగులు నెలకొంది. సాధారణ ఎన్నికల్లో టిఆర్ఎస్ తో పొత్తుకు తహతహలాడిన పార్టీలు గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీతో జత కట్టడానికి సాహసించలేకపోతున్నాయి. అలాగే సాధారణ ఎన్నికల్లో ఒంటరి పోరుతో చతికిలబడిన ప్రజారాజ్యం పార్టీ కనీసం గ్రేటర్ ఎన్నికల్లో అయినా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. లోక్ సత్తా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రజారాజ్యం పార్టీ ఆసక్తి చూపినప్పటికీ, ఆ పార్టీ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు. ప్రజారాజ్యంతో పొత్తుకు సిపిఐ ఆసక్తి చూపినప్పటికీ, టిడిపితో సంబంధాలు తెగతెంపులు చేసుకునేటేనే పొత్తు పెట్టుకుంటామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి షరతు పెట్టారు. ఇలా షరతులు పెట్టడం ప్రజారాజ్యం పార్టీకి తగదని సిపిఐ సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత సిపిఐ, పిఆర్పీ మధ్య పొత్తుల ప్రస్తావన నిలిచిపోయింది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లోనైనా పొత్తులతో గట్టెక్కాలనుకున్న ప్రజారాజ్యం పార్టీ మళ్ళీ ఒంటరి పోరే శరణ్యం అవుతుందేమో నని దిగులు పడుతోంది.
గ్రేటర్ ఎన్నికలపై కనీసం పిఆర్పీలో కసరత్తు అయినా జరుగుతోంది కానీ, టిఆర్ ఎస్ లో మాత్రం అలాంటి అలికిడే కనిపించడం లేదు. సాధారణ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలకు తోడు, పార్టీలో తలెత్తిన అసమ్మతితో ఉక్కిరిబిక్కిరి అయిన టిఆర్ఎస్ ఇంకా దాని ప్రభావం నుంచి తేరుకోలేకపోతోంది. పైగా పార్టీ అధినేత కెసిఆర్ పార్టీ కార్యాలయానికి రావడం మానేయడంతో టిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం గ్రేటర్ ఎన్నికల వేళబోసిపోయింది. గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పోటీ చేస్తుందా, చేస్తే ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందన్నది కూడా ఆ పార్టీ నాయకులు చెప్పలేకపోతున్నారు. హైదరాబాద్ లో సమైక్యవాదం నినాదం కూడా కాస్తబలంగానే ఉండడంతో, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టిఆర్ఎస్ తో జతకట్టేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదు.
టిఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిన ఆ పార్టీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ తెలంగాణ సాధన సమితిని స్థాపించి, తెలంగాణ వాదం బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ సమస్యలపై ఉద్యమానికి సమాయత్తం అవుతుండగా, అలాంటి ప్రయత్నాలేవీ కూడా టిఆర్ఎస్ లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో మహాకూటమితో జతకట్టి ఎంతో హడావుడి సృష్టించిన టిఆర్ఎస్ లో గ్రేటర్ ఎన్నికల సందడి లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో, నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. దీనికి భిన్నమైన పరిస్థితి అటు ప్రజారాజ్యం పార్టీలోనూ నెలకొంది. ఏ రోజు ఏ నాయకుడు పార్టీని విడిచి వెళ్ళిపోతారన్న భయంతో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. బలమైన పార్టీ యంత్రాంగం కలిగిన కాంగ్రెస్, టిడిపిలతో నెగ్గుకురావడం కష్టమేనన్న అంచనాలతో మిగిలిన పార్టీ సీనియర్లు కాంగ్రెస్, టిడిపిల్లోకి వెళ్ళేందుకు ఆసక్తిగా పావులు కదుపుత్ననారు.
News Posted: 20 July, 2009
|