కసబ్ ను ఉరితీశారు!
ముంబయి: భారత్ లో ఉగ్రవాదుల దాడులకు పరాకాష్ఠగా నిలచి..26|11గా పేరు పడిన ముంబయి దాడుల్లో పట్టుబడిన ఏకైక ఉగ్రవాది కసబ్ పై న్యాయస్థానం విచారణ ఇంకా పూర్తి కాలేదు. కానీ.. ముంబయి సినీ పండితలోకం మాత్రం ఈ ఉగ్రవాదిని ఉరి తీసింది. ఉగ్రవాదుల దాడులపై దర్శకుడు సురీందర్ సూరి తీసిన 'టోటల్ టెన్' చిత్రాన్ని సినీ విశ్లేషకులు 'సి' గ్రేడ్ గా అభివర్ణిస్తున్నారు. ఇది ఆగస్ట్ లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.
ఉగ్రవాద ముష్కరుల దాడులపై బాలీవుడ్ లో ఇప్పటికే 30 పేర్లను సినీ నిర్మాతలు నమోదు చేసుకున్నారు. సూరి తీసిన 'టోటల్ టెన్' చిత్రంపై ఉగ్రవాది కసబ్ న్యాయవాది అబ్బాస్ కజ్మీ అభ్యంతరం తెలిపారు. ''ఇంకా విచారణ జరుగుతున్న ఖైదీని ఉరి తీసినట్టు చూపడం దారుణం. ఈ సినిమాను విడుదల చేస్తే నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను'' అని హెచ్చరించారు. కసబ్ పాత్రను రాజన్ వర్మ (28) అనే నటుడు పోషించారు. 'టోటల్ టెన్' తో సి గ్రేడ్ సినిమాలతో రాజన్ వర్మ బిజీగా మారారు. కాలేజీ చదువు పూర్తి కాకుండానే 2000లో ముంబయి చేరిన వర్మ అడపా దడపా టీవీల్లో చిన్నపాత్రలు పోషించాడు. సోనీ టీవీలో మెగా సీరియల్ జస్సీ జైసీ కోయీ నహీన్ లో కొద్దిసేపు కనిపిస్తారు.
సురీందర్ సూరి అడగడంతో సంశయిస్తూనే కసబ్ పాత్రను వర్మ ఒప్పుకున్నారు. తదుపరి సూరి చిత్రం.. 'గుణతంత్ర'లో వర్మ వరుణ్ గాంధీ పాత్ర పోషించనున్నారు. కసబ్ పాత్రను తెరకెక్కించినందుకు దర్శకుడు సూరి, నటుడు వర్మలను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలొస్తున్నాయి. మొత్తానికి 'టోటల్ టెన్' ద్వయానికి మాత్రం ప్రచారం వస్తోంది. సినిమా వాళ్లకు అంతకన్నా కావలసింది ఏముంది?
News Posted: 20 July, 2009
|