'గ్రహణం' టూరిజం!
న్యూఢిల్లీ: ఈ నెల 22న సంభవించనున్న సంపూర్ణ సూర్యగ్రహణం పుణ్యమాని పలు రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు యాత్రలు నిర్వహించే వారు తమ వ్యాపారాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శతాబ్దిలో సంపూర్ణ సూర్య గ్రహణం తొలిగా సంభవిస్తోంది. మరో 25 ఏళ్లకుగాని తిరిగి సంపూర్ణ గ్రహణం సంభవించదు. దీంతో బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో గ్రహణాన్ని చూడటానికి అనువైన ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నాయి. బీహార్లో తెరగణ ప్రాంతానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు చేరుకున్నారని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారి పీయుష్ కుమార్ సిన్హా తెలిపారు. 20 ఏళ్ల పరిశోధన అనంతరం గ్రహణాన్ని చూడటానికి మంచి అనువైన ప్రదేశంగా తెరగణను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. ఈ విషయాన్ని భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఏనాడో ఆరో శతాబ్దంలోనే స్పష్టం చేశారు.
గుజరాత్ శాస్త్ర సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో సూరత్ లో గ్రహణం వీక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్రహణ కాలాన్ని ఆధ్యాత్మికంగా దృష్టి సారించింది. గ్రహణ కాలంలో చేయాల్సిన కర్మకాండలకు హిందువులు ప్రాధాన్యత ఇస్తారని పర్యాటకశాఖ అధికారి మనీష్ ప్రసాద పేర్కొన్నారు. నాస్తికులు కూడా గంగానది ఒడ్డున నిలబడి ఆకాశంలో రంగులు మారే దృశ్యాన్ని చూడటం మంచి అనుభూతిగా నిలచిపోతుందన్నారు. ఈ నెల 21,22,23 తేదీల్లో రాష్ట్రీయ సూర్య మహోత్సవాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకు ఢిల్లీకి చెందిన శాస్త్ర, సాంకేతిక సమాచార జాతీయ మండలి సహకరిస్తోంది. కొన్ని సంస్థలు గ్రహణకాలంలో ఆకాశంలో పర్యటించేందుకు విమానాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేశాయి. ఈ విమానంలో సీటు కోసం రూ.79,000 లేదా రూ.29,000 చెల్లించాలి.
News Posted: 20 July, 2009
|