ప్రసన్న దారిలోనే నాగిరెడ్డి
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై బాహాటంగా ధ్వజమెత్తి సస్పెన్షన్ కు కు గురైన సంఘటన మరిచిపోకముందే కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమని తేలిపోయింది. ఆయన సోమవారం రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి అరగంటకు పైగా మంతనాలు జరిపారు. ఈ నెల 24 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి సరిగా మూడు రోజుల ముందు బాలనాగిరెడ్డి ముఖ్యమంత్రిని కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. రెండు, మూడు రోజుల్లో ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని, ఈ లోపు తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తనున్నారని తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పాటు ఆయన సోదరులను వెంటపెట్టుకుని బాలనాగిరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు.
తమ పార్టీకిచెందిన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న విషయం తమకెప్పుడో తెలుసునని తెదేపాకు చెందిన ముఖ్యనేత ఒకరు ఆరోపించారు. వైఎస్ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే బాలనాగిరెడ్డి కాంగ్రెస్ పంచన చేరారని ఆ నేత వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ గుర్తుతో ఎన్నికల్లో గెలిచిన నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, తమ పార్టీ గుర్తుతో గెలిచిన ఆయన రాజీనామా చేయకుండా ఇతర పార్టీలలో చేరితే సహించేది లేదని హెచ్చరించారు.
News Posted: 21 July, 2009
|