ఢిల్లీ షాపుల్లో హిల్లరీ బేరాలు
న్యూఢిల్లీ: ఆయుధాల్లోనే కాదు.. దుస్తుల కొనుగోలులో కూడా బేరసారాలాడగలనని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ నిరూపించుకున్నారు. భారత్ లో ముంబయి, ఢిల్లీల్లో పర్యటించిన ఆమె రూ.20,285 విలువైన వస్తు సామాగ్రిని కొన్నట్టు సన్నిహితవర్గాలు తెలిపాయి. ఢిల్లీలో పర్యాటకుల్ని కట్టిపడేసే దిల్లీహాత్ లోకి ప్రత్యేక మార్గం నుంచి ప్రవేశించిన హిల్లరీ.. మయన్మార్, అఫ్గాన్ కాందిశీకులు తయారు చేసిన దుస్తుల్లోంచి కావల్సినవి ఎంచుకున్నారు. దుకాణదారుడు రూ.200 అడిగితే, ఆమె రూ.150 చేతుల్లో పెట్టారు. సాధారణంగా దిల్లీహాత్ ధరల్ని దుకాణదారులు పెద్దగా తగ్గించరు. హిల్లరీ ముంబయి షాపింగ్ లో కూడా తన భర్త క్లింటన్, కుమార్తె చెల్సియాకు స్థానికంగా తయారైన బట్టలనే కొన్నారు.
దిల్లీహాత్ లో ఒక దుకాణంలో గాజులను చూసి ముచ్చట పడిన ఆమె.. వాటి ధర రూ.200 ఎక్కువగా ఉందన్నారు. ధర తగ్గించేందుకు సుముఖత చూపని యజమాని చివరకు రూ.135 తీసుకున్నారు. అదే విధంగా పాత కాలపు గ్రామఫోన్, 25 ఏళ్లనాటి గడియారం హిల్లరీ కళ్లను కట్టిపడేశాయి. అయితే గ్రామఫోన్ ధర రూ.2,700, గడియారం వెల రూ.2,500గా చెప్పగానే కనుబొమలు ఎగురేశారు.
News Posted: 21 July, 2009
|