ఇన్ఫీ మూర్తి ఇంట్లో పెళ్లిబాజా
బెంగళూరు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత(29) వివాహం బెంగళూరు నగరంలో ఆగస్ట్ 30న అంగరంగ వైభవంగా జరగనుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఐరోపా సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గా అక్షత వ్యవహరిస్తున్నారు. పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాల్లో ఈ సంస్థ పాల్గొంటుంది. వరుడు రుషి సునాక్ ఆక్స్ ఫర్డ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈయన భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు. అమెరికా కేంద్రంగా క్రిష్ హాన్ ఆధ్వర్యంలోని ధార్మిక సంస్థ టీసీఐలో సునాక్ భాగస్వామి. భారత్ తో అనుబంధం గల కంపెనీ ఏర్పాటు చేయడం ఇష్టం అంటున్న మూర్తి కుమార్తె అక్షత అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్. మార్పు కోసం ప్రజలు రాజకీయాల్లోకి రావాలని ఆమె అభిప్రాయపడతారు.
తన కుమార్తె అక్షత వివాహాన్ని ధ్రువీకరించిన నారాయణమూర్తి, ఆహ్వానపత్రాలు సిద్ధమయ్యాయని తెలిపారు. నిరాడంబరతను ప్రదర్శించే తన కుమార్తె అనుమతించాకనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. వధూవరుల తరపున కొన్ని వందల మంది స్నేహితులు బెంగళూరులో వివాహానికి హాజరు కానున్నారు. భారత్, ఇతర దేశాల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి ఉన్న పరిచయాల దృష్ట్యా వివాహం మహా వైభవంగా జరుగుతుందని భావిస్తున్నారు.
ఐటీ రంగంలో ఇతర ప్రముఖులకు భిన్నంగా మూర్తి జీవించారు. ఆయన ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. దంపతులిద్దరూ గాంధేయ విలువలు అనుసరిస్తారు. చివరకు ఆయన తిన్న ఎంగిలి కంచాన్ని స్వయంగా కడగుతారు. వారెప్పుడూ తమ పిల్లల పుట్టినరోజులు చేయలేదు. వారింట్లో పనిమనిషి కూడా లేదు. బెంగళూరులోని జయానగర్లో మధ్యతరగతి వాళ్లు నివసించే అపార్ట్ మెంట్ లోనే మూర్తి కుటుంబం నివసిస్తోంది. ఆయన వారసత్వంగా ఇవ్వకుండానే కుమార్తె అక్షత, కుమారుడు రోషన్ లు షేర్ హోల్డర్లయ్యారు. 1978లో కేవలం కుటుంబసభ్యులే హాజరైన మూర్తి, సుధల వివాహానికైన ఖర్చెంతో తెలుసా.. రూ.800 మాత్రమే! ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల నిరాడంబరత, పొదుపులకు తగ్గట్టుగానే అక్షత వివాహం జరుగుతుందా.. అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న!
News Posted: 21 July, 2009
|