గుంటూరు హీలియం!
గుంటూరు : రాష్ట్రంలో ఎవరికైనా గుంటూరు అనగానే మిర్చి ఘాటు గుర్తుకు రావడం సహజం. గ్రహణాలకు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలకు మూలమైన హీలియం మూలకాన్ని తొలుత కనుగొన్నది మన గుంటూరులోనే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ప్రపంచంలో ఎవరైనా గ్రహణాలకు సంబంధించి శాస్త్రీయ ప్రాధాన్యతను వివరించాలంటే తొలుత గుంటూరులో జరిగిన పరిశోధనను ఉటంకించక తప్పదు. అప్పటివరకు మానవాళికి హీలియం అనే మూలకం ఉందని తెలియదు. ఈ ఆవిష్కరణ గుంటూరులోనే జరిగింది. 1868 ఆగస్టు 18న ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా గుంటూరులో శాస్త్రవేత్తల బృందాలు పరిశోధనలు చేశారు. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పియర్రే జాన్సన్, బ్రిటన్ ఖగోళ శాస్త్రవేత్త జెఎఫ్ టెన్నెంట్ ల నాయకత్వంలో శాస్త్రవేత్తల బృందం గుంటూరు సమీపంలోని పొగాకు తోటల్లో ఉండి సూర్యగ్రహణాన్ని వీక్షించారు. స్పెక్ట్రోస్కోప్ తో మొట్టమొదటిసారిగా సూర్యగ్రహణాన్ని వీక్షించారు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు పూర్తిగా మాయమై కరనోనా మాత్రమే కనబడుతుంది. ఈ సమయంలో స్పెక్ట్రోస్కోప్ ద్వారా చూసి కొత్త మూలకాన్ని కొనుగొన్నారు. అప్పటివరకు ఆ మూలకం భూమి మీదే కనబడలేదు. ఆ మూలకానికి హీలియం అని పేరు పెట్టారు. గ్రీక్ భాషలో హీలియాస్ అంటే సూర్యుడు.ఆ తర్వాత 27 సంవత్సరాలకు ప్రయోగాలకు ప్రయోగశాలలో హీలియంను కనుగొన్నారు. ఇంతటి అద్భుత ఆవిష్కరణ మన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జరగడం మనందరికీ గర్వకారణం.
News Posted: 22 July, 2009
|