'మాయ'కు భద్రత కట్
న్యూఢిల్లీ: మంత్రులు, ముఖ్యమంత్రులతోపాటు మాజీలైన మంత్రులు, ముఖ్యమంత్రులకు భద్రతా సిబ్బంది(బ్లాక్ క్యాట్ కమెండోలు)ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వీరిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిసహా మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ దంపతులు, ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. వారికి కల్పించిన జాతీయ భద్రతా దళం(ఎన్ ఎస్ జీ) కమెండోలను ఉపసంహరించాలని హోంశాఖ ఆధ్వర్యంలోని భద్రతాసమీక్ష కమిటీ నిర్ణయించింది.
కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో మాయావతికి భద్రత పెరిగింది. ఈ కాలంలోనే మాజీ ముఖ్యమంత్రులు లాలూ, రబ్రీదేవీ, ములాయంలకూ భద్రత పెరిగింది. భద్రతాసిబ్బందిని తగ్గించే జాబితాలో వీరితోపాటు భాజపాకు చెందిన మురళీమనోహర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ లు ఉన్నారు. వీరే కాకుండా మాజీ మంత్రులు శివరాజ్ పాటిల్, రాంవిలాస్ పాశ్వాన్, జగ్ మోహన్ కూడా ఉన్నారు. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లై అధ్యక్షతన జరిగిన భద్రతా సమీక్ష సమితి సమావేశం సూచించింది. హోం మంత్రి ఆమోదం తరువాతే ఈ ప్రతీపాదనలు అమలుకు నోచుకుంటాయి.
ప్రొటోకాల్ ప్రకారం భద్రత కల్పించాల్సిన వారితోపాటు ఉగ్రవాదులు, ఇతరత్రా ముప్పు పొంచి ఉన్నవారికే భద్రతా సిబ్బందిని కేటాయించాలని హోం మంత్రి భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. దీంతో లోక్ సభ ఎన్నికల సమయంలో భద్రత కోత వేసిన వారికి కూడా సిబ్బందిని కేటాయించవచ్చునని భావిస్తున్నారు. అయితే భద్రతను తగ్గించడం కష్టమైన వ్యవహారంగా అధికారులు అభిప్రాయ పడుతున్నారు. హోం మంత్రిగా శివరాజ్ పాటిల్ ఉన్నపుడు బీహార్ ప్రభుత్వాన్ని లాలూ అదిలించి, బెదిరించి పాట్నా హౌస్ వద్ద మరింత భద్రతను పెంచుకున్న వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
News Posted: 22 July, 2009
|